icon icon icon
icon icon icon

జగన్‌ ఓ ఊసరవెల్లి.. నోరు తెరిస్తే అబద్ధాలే

వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్‌కు అధికారం ఉందన్న అహంకారంతోనే. అవినాష్‌రెడ్డిని చట్టసభలకు వెళ్ల్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నాను. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేది నేనే.

Updated : 07 May 2024 07:11 IST

వైఎస్‌ మరణానికి రిలయన్స్‌ కారణమని జగన్‌ అంటే నిజమే అనుకున్నాం
వివేకా హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్నా నమ్మాం
సీబీఐ ఛార్జిషీట్‌లో వైఎస్‌ పేరు కాంగ్రెస్‌ చేర్చిందంటే వాస్తవమనుకున్నాం
అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది
కడపలో న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటంలో గెలిచేది నేనే
నేను గెలుస్తానని జగన్‌కు తెలుసు కాబట్టే అంత భయపడుతున్నారు
వైఎస్‌ పేరు చేర్చినందుకు నజరానాగా పొన్నవోలుకు ఏఏజీ పోస్టు
‘ఈనాడు- ఈటీవీ’ ముఖాముఖిలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్‌కు అధికారం ఉందన్న అహంకారంతోనే. అవినాష్‌రెడ్డిని చట్టసభలకు వెళ్ల్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నాను. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేది నేనే.

కుటుంబంలో ఒక్కరే రాజకీయాల్లో ఉండాలన్నట్లు జగన్‌ మాట్లాడారు. వ్యాపారాలు చూసుకోవాలి అంటున్నారు... వ్యాపారాలు చేసుకోవాలని అప్పట్లో నేను అనుకుంటే ఈ రోజు వైకాపా ఎక్కడుండేది? కడప లోక్‌సభ స్థానం ఎన్నికల్లో న్యాయానికి, నేరానికి మధ్య పోరాటం జరుగుతోందని.. అందులో గెలిచేది న్యాయం వైపున్న తానేనని పీసీసీ అధ్యక్షురాలు, సీఎం జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. జగన్‌ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఆయన్ను మించిన ఊసరవెల్లి ఇంకెవరుంటారని  నిప్పులు చెరిగారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం వెనుక రిలయన్స్‌ సంస్థ హస్తం ఉందని అప్పట్లో ఆరోపించి, వైకాపా శ్రేణుల్ని రెచ్చగొట్టిన జగన్‌..  అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్‌ మనిషికి ఎంపీ పదవి ఇవ్వడమే ఆయన నైజమేంటో చెప్పిందని విమర్శించారు.

అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ఛార్జిషీట్‌లో తండ్రి వైఎస్‌ పేరు చేర్పించింది ముమ్మాటికీ జగనేనని, ఆ పని చేసినందుకు నజరానాగానే పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టు ఇచ్చారని ఆమె మండిపడ్డారు. కడప లోక్‌సభ స్థానంలో వైకాపా అభ్యర్థి, వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్‌రెడ్డిని సవాల్‌ చేస్తున్న షర్మిల ‘ఈనాడు- ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...

జగన్‌ మాటలు నమ్మి మోసపోయాం

సీబీఐ ఛార్జిషీట్‌లో మా నాన్న పేరును కాంగ్రెస్‌ పార్టీనే చేర్చిందని అప్పట్లో నేను అన్న మాట నిజమే. ఎందుకంటే అప్పట్లో మాకు వాస్తవం తెలీదు. వైఎస్‌ మరణం వెనుక రిలయన్స్‌ పాత్ర ఉందని జగన్‌ చెబితే నిజమే అనుకుని ఆ సంస్థ ఆస్తులపై దాడులు చేసి, కొన్ని వేల మంది ఇప్పటికీ కేసుల్లో తిరుగుతున్నారు. రిలయన్స్‌పై అంత అభాండం వేసిన జగన్‌.. ముఖ్యమంత్రయ్యాక వాళ్ల మనిషికే ఎంపీ పదవి ఇచ్చారు. వైఎస్‌ మరణం విషయంలో ఆయన చెప్పింది అబద్ధమని నిరూపించుకున్నారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందనీ జగన్‌ ఎన్నికల ముందు చెప్పారు. సీబీఐ విచారణ కూడా కోరారు. అధికారంలోకి వచ్చాక ఆయనే సీబీఐ విచారణ అక్కర్లేదన్నారు. తద్వారా తను చెబుతున్నది అబద్ధమని మరోమారు నిరూపించుకున్నారు. మా నాన్న పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపిస్తే అందరం గుడ్డిగా నమ్మాం. మా నాన్న పేరును ఛార్జిషీట్‌లో చేర్చడంలో కాంగ్రెస్‌ ప్రమేయం లేదని నేను సోనియాగాంధీని కలిసినప్పుడు చెప్పారు. ఇదే మాట తర్వాత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా చెప్పారు. వైఎస్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయినా.. జగన్‌ ఆదేశాల మేరకు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మూడు కోర్టుల చుట్టూ తిరిగి మరీ ఆయన పేరును ఛార్జిషీట్‌లో చేర్చేలా చేశారు. వైఎస్‌ పేరు చేర్చకపోతే ఆ కేసుల నుంచి జగన్‌ బయటపడటం అసాధ్యమన్న ఉద్దేశంతోనే అదంతా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఆరు రోజులకే.. పొన్నవోలుకు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టు ఇవ్వడమే.. అదంతా జగనే చేయించారనడానికి రుజువు. నేను అప్పుడో మాట, ఇప్పుడో మాట మాట్లాడుతున్నానని, ఊసరవెల్లినని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. నేను కాదు.. ఇన్ని అబద్ధాలు చెప్పిన జగనే అసలైన ఊసరవెల్లి.

అవినాష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకపోతే.. నేను కడపలో పోటీ చేసేదాన్నే కాదు

అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ టికెటివ్వకపోతే.. నేను అక్కడ పోటీ చేసేదాన్నే కాదు. ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నట్టుగా.. వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్‌కు అధికారం ఉందన్న అహంకారంతోనే. అవినాష్‌రెడ్డిని చట్టసభలకు వెళ్ల్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నాను. వివేకా కడప జిల్లా ప్రజలకు 40 ఏళ్లు సేవ చేశారు. ఆయన్ను హత్య చేసి ఐదేళ్లయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. సీబీఐ ఆధారాలు, సాక్ష్యాలు బయటపెట్టిన తర్వాత కూడా జగన్‌కు నిజాన్ని అంగీకరించే ధైర్యం లేదు. సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్‌రెడ్డిని.. జగన్‌ ఆయనకున్న కారణాల వల్ల కాపాడుకుంటూ వస్తున్నారు. కర్నూలులో అవినాష్‌ను అరెస్ట్‌ చేయడానికి సీబీఐ అధికారులు వెళితే.. మూడు రోజులపాటు భయంకరమైన వాతావరణం సృష్టించి, వాళ్ల మనుషులు, పోలీసులతో అడ్డుకున్నారు. ఆ రోజు సునీత నిస్సహాయంగా ఉండిపోయింది. వివేకా హత్యపై ప్రజాకోర్టులోనైనా తీర్పు రావాలి.

ఆ మాట అవినాష్‌రెడ్డికి చెప్పొచ్చుగా..

కడపలో నాకేదో డిపాజిట్లు కూడా రావని, అందుకే బాధపడుతున్నానన్నట్టుగా జగన్‌ మాట్లాడుతున్నారు. ఆయనకు నిజంగా అంత బాధ ఉంటే.. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖలో రాసినట్టుగా అవినాష్‌రెడ్డిని విత్‌డ్రా చేసుకోమని చెప్పొచ్చు. కానీ నన్ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. నేను గెలుస్తానన్న నమ్మకం జగన్‌కు కుదిరింది కాబట్టే.. ఆయన సతీమణి భారతి సహా మా కుటుంబంలో ఆయన అధికారానికి, డబ్బులకు లోబడేవారందరినీ మూకుమ్మడిగా ప్రచారంలోకి దించారు. వారంతా జగన్‌రెడ్డి కూడా ఓడిపోతారన్న భయంతో ఆయన కోసం ప్రచారం చేస్తున్నారా అని అనిపిస్తోంది.

రైతులకే కనిపించని జగన్‌మోహన్‌రెడ్డి

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ రాజశేఖరరెడ్డ్డి కల. అది జగన్‌కూ తెలుసు. అయినా ఈ రోజు వరకు ఒక తట్టెడు మట్టి పోయలేదు. ఇది రాజశేఖరరెడ్డ్డి మార్కు రాజకీయమా? రుణమాఫీ, మద్దతు ధర, పెట్టుబడుల తగ్గింపు, రాయితీల విషయంలో రైతుల్ని రాజశేఖరరెడ్డ్డి ఎంతో బాగా చూసుకున్నారు. రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క ఏడాదైనా పెట్టారా? అసలు ఆయన రైతులకే కన్పించలేదు. రైతులకు కష్టం వచ్చినా భరోసా ఇచ్చింది లేదు. ఐదు సంక్రాంతులు పోయినా జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు.

చిన్నాన్న గురించి ఐదేళ్లలో ఒక్క మంచిమాట మాట్లాడలేదు

ప్రజల కోసం వివేకా అంత తపించే మంచి మనిషి ఈ రోజుల్లో భూతద్దంతో వెతికినా కనిపించరు. అలాంటి మనిషిని పొగిడేందుకు జగన్‌కు ఈ ఐదేళ్లలో ఒక్క మంచి మాటా దొరకలేదు. ఒక్క పూలదండా వేయలేదు. నివాళులర్పించలేదు. అంతమందితో సభ పెట్టి... వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు మనసొచ్చిందే తప్ప ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. సామాజిక మాధ్యమాల్లో వివేకా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వివేకా చివరి నిమిషం వరకు వైకాపా కోసమే పనిచేశారన్న ఇంగితం కూడా జగన్‌కు లేకపోయింది. సాక్షి పత్రికలో పైన వైఎస్‌ ఫొటో ఉంటుంది.. కింద వివేకా వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కథనాలు రాస్తారు.

వచ్చేది నిశ్శబ్ద విప్లవమే

తమ అభిమానపాత్రుడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారనే విషయం కడప ప్రజలందరికీ తెలుసు.న్యాయం కోసం సునీత ఎక్కని కోర్టు మెట్టు లేదు. తట్టని తలుపు లేదు. హత్య చేసినవారు వీరే అని సీబీఐ చెబుతున్నా జగన్‌  అవినాష్‌రెడ్డిని కాపాడుతూ వచ్చారు. ఇవన్నీ కడప ప్రజలు చూస్తున్నారు. అందుకే నిశ్శబ్ద విప్లవం రాబోతోంది. వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని. షర్మిలను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్‌ విజయం కడప నుంచే మొదలు

కాంగ్రెస్‌ పార్టీ దయనీయ స్థితిలో ఉన్నప్పుడు 1983లో రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చారు. విధి రాతేమో తెలియదు. 40 ఏళ్ల తర్వాత నేను మళ్లీ కాంగ్రెస్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాను. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఈ దఫా ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మా పార్టీ విజయం కడప నుంచే మొదలవుతుంది.

కడప ప్రజల గొంతుకనవుతా

రాజశేఖరరెడ్డ్డి, వివేకానందరెడ్డి ఈ ప్రాంతానికి నాయకులుగా ఎంతో చేశారు. అదే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నా. రాజశేఖరరెడ్డ్డి బిడ్డగా మాటిస్తున్నా.. నన్ను గెలిపిస్తే మీ బలం అవుతా. మీ గొంతుకనవుతా. మీ కోసం కొట్లాడతా. ఏ నాయకుడికీ భయపడాల్సిన పనిలేదు. ఇక్కడే, జనానికి అండగా నిలబడతా. ఈ గడ్డకే జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నా.

ఎస్సీ, ఎస్టీలకు కనీస గౌరవం ఇవ్వలేదు

జగన్‌మోహన్‌రెడ్డి నా ఎస్సీ, ఎస్టీ అంటారు. అలా అనే ముందు నిజంగా వారి కోసం ఏం చేశారో ఆలోచించుకోవాలి. ఉపప్రణాళికలో కేటాయించిన నిధుల్ని కూడా వారి కోసం వాడటం లేదు. కనీస గౌరవం ఇవ్వకపోతే మీ మనుషులు ఎలా అవుతారు? వీరంతా మీ బాధితులే కదా? రాజశేఖరరెడ్డ్డి హయాంలో కార్పొరేషన్‌ రుణాలిచ్చేవారు. స్వయం ఉపాధి కల్పించేవారు. చదువుకు సహాయం చేసేవారు. నవరత్నాలు పెట్టిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇచ్చే పథకాలేవీ లేవు కదా. అన్ని పథకాలూ ఎత్తేశారు. జగన్‌ నా అక్క చెల్లెళ్లు అని కూడా అంటుంటారు. నిజంగా చెల్లెళ్ల కోసం ఏం చేశారు?

భాజపాతో పొత్తుకు పాకులాడుతున్నారు

జగన్‌, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా అనేది మనకు విభజన చట్టం ఇచ్చిన హక్కు. పోలవరం, రాజధాని నిర్మాణం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ ఇవన్నీ విభజన నాటి హామీలే. గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి  వారు చేయాల్సింది చేయలేదు. ప్రజల హక్కుల్ని పణంగా పెట్టి భాజపాతో దోస్తీ చేశారు. భాజపాతో పొత్తుల కోసం పాకులాడారు. కాబట్టే రాజశేఖరరెడ్డ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది. ప్రత్యేక హోదా రావాలంటే కొట్లాడాలి. కొట్లాడాలి అంటే ఒక గొంతు ఉండాలి. వేదిక ఉండాలి. రాహుల్‌గాంధీ జోడో యాత్రకు వచ్చినప్పుడు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టే కాంగ్రెస్‌లో చేరాను. ఆ పార్టీ తరఫున గొంతెత్తుతున్నాను.

జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది

జగన్‌ ఈ మధ్య ప్రతిదానికీ చంద్రబాబు జపం చేస్తున్నారు. చంద్రబాబు అంటే జగన్‌కు ఒక పిచ్చిలా మారిపోయిందేమోనని భయమేస్తోంది. నేను కాంగ్రెస్‌లో చేరడానికీ, కడపలో పోటీ చేయడానికీ చంద్రబాబే సూత్రధారి అట. నన్నూ, సునీతనూ ఆయనే కంట్రోల్‌ చేస్తున్నారట. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని నిందితుడిగా చేర్చడానికీ ఆయనే కారణమట. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రధాని మోదీని కూడా చంద్రబాబే కంట్రోల్‌ చేస్తున్నారట. జగన్‌ చంద్రబాబును ఎందుకంత శక్తిమంతుడిలా ఊహించుకుంటున్నారో, ఏ సంఘటన జరిగినా అన్ని వేళ్లూ ఆయనవైపే ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. చివరకు వైకాపా పెట్టిందీ, తాను రాజకీయాలు చేస్తున్నది కూడా చంద్రబాబు వల్లే అని చెప్పే స్థాయికి జగన్‌ వెళ్లిపోతారేమోనన్న భయంతోనే అద్దం బహుమతిగా పంపాను. జగన్‌ ఒకసారి అద్దంలో చూసుకుంటే.. ఆయనే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో పరీక్షించుకుంటారనే పంపాను.

కుటుంబమే ముఖ్యమని త్యాగాలు చేశా

కుటుంబంలో ఒక్కరే రాజకీయాల్లో ఉండాలన్నట్లు జగన్‌ మాట్లాడారు. వ్యాపారాలు చూసుకోవాలి అంటున్నారు. నిజంగానే నేను వ్యాపారాలపైనే దృష్టి పెట్టాలనుకుంటే జగన్‌ జైలుకెళ్లిన రోజున.. పాదయాత్ర చేసేదాన్ని కాదు. ఆ రోజు వారికి అవసరం కాబట్టి అడిగారు. నేను చేశాను. వ్యాపారాలు చేసుకోవాలని అప్పట్లో నేను అనుకుంటే ఈ రోజు వైకాపా ఎక్కడుండేది? 2019 ఎన్నికల్లోనూ బైబై బాబు అనే ప్రచారం విజయవంతమైంది. కుటుంబం, విలువలకు కట్టుబడటం ముఖ్యం అనుకునే త్యాగాలు చేశాను. అందుకే వైకాపా ఇక్కడుంది (అధికారంలో). గతంలో రాజశేఖరరెడ్డ్డి, వివేకానందరెడ్డి, రాజారెడ్డి కలిసి రాజకీయాలు చేశారు. కాబట్టే రాజశేఖరరెడ్డ్డి అప్పుడు అంత బలవంతుడయ్యారు. వైకాపాలో జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, సుబ్బారెడ్డితోపాటు మొన్నటి వరకు గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ ఉన్నారు. లేనిది నేను మాత్రమే.

జలయజ్ఞాన్ని పక్కన పడేయడమే.. జగన్‌ మార్కు రాజకీయం

జగన్‌ ముఖ్యమంత్రి అయితే మళ్లీ రాజశేఖరరెడ్డ్డి పాలనే వస్తుందని.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా సాగిస్తారని నేనే కాదు, కోట్లమంది విశ్వసించారు. కానీ సీఎం అయ్యాక పూర్తి వ్యతిరేకంగా తయారైంది. భాజపా మతతత్వ పార్టీ అని, రాజశేఖరరెడ్డ్డి ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సందర్భంలోనూ భాజపాకు మద్దతిచ్చారు. మణిపుర్‌ ఘటనలో అవిశ్వాస సమయంలో అండగా నిలిచారు. అది రాజశేఖరరెడ్డ్డి మార్కు రాజకీయం ఎలా అవుతుంది? జలయజ్ఞమే నా జీవిత లక్ష్యమని రాజశేఖరరెడ్డ్డి నాకు చాలాసార్లు చెప్పారు. కాటన్‌ దొరలా నిలవాలనేది ఆయన కల. ఆయన హయాంలో 54 ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో 42 అసంపూర్తిగా ఉన్నాయి. రాజశేఖరరెడ్డ్డి కుమారుడిగా వాటిని పూర్తి చేస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. సీఎం అయ్యాక వాటిని పక్కన పెట్టేశారు.

విజయమ్మ అమెరికాలో ప్రశాంతంగా ఉన్నారు

నా కుమారుడు, కోడలు, నా బిడ్డతో విజయమ్మ అమెరికాలో ప్రశాంతంగా ఉన్నారు. విజయమ్మ కుమారుడు ఒక పార్టీలో, కుమార్తె మరో పార్టీలో ఉన్నారు. ఇద్దరూ రెండు కళ్లు అయినప్పుడు ఒక్కటి ఎంచుకోవాలని ఆమెను కోరడం భావ్యం కాదు.

ఎటువైపు ఉండాలో జనం నిర్ణయించుకున్నారు.

ఒకపక్క రాజశేఖరరెడ్డి బిడ్డ, మరోపక్క ఆయన తమ్ముడు వివేకానందరెడ్డిని హత్య చేశారని సీబీఐ చెబుతున్న నిందితుడు ఉన్నారు. న్యాయానికీ, నేరానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలో ఎటువైపు ఉండాలో జనం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. నా విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.

వాళ్లకు భయపడితే నేను రాజశేఖరరెడ్డి బిడ్డనే కాదు

జగన్‌, అవినాష్‌రెడ్డిలకు నేను భయపడను. అలా భయపడితే నేను రాజశేఖరరెడ్డి బిడ్డనే కాదు. నాలోనూ వైఎస్‌ రక్తమే ఉంది. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖరరెడ్డి తమ్ముడు హత్యకు గురయితే ఇంత వరకు న్యాయం జరగలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఢిల్లీలో పరపతి ఉపయోగించి నిందితులకు శిక్ష పడకుండా అడ్డుకుంటున్నారు. వివేకా హత్య జరిగిన చోట సాక్ష్యాధారాల్ని చెరిపేస్తుంటే అవినాష్‌రెడ్డి అమాయకంగా చూస్తున్నాడంటూ మా మేనమామే కథలు చెబుతున్నారు. ఇల్లంతా రక్తం చింది, వివేకా శరీరంపై అన్ని గొడ్డలి పోట్లుంటే.. గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో ఎందుకు చెప్పారు? ప్రతిపక్షనేతగా దీనిపై సీబీఐ విచారణ కోరిన జగన్‌ ఇప్పుడెందుకు వద్దంటున్నారు? ఏదీ దాచకపోతే.. సీబీఐ విచారణో, మరొకటో వేస్తే మీకొచ్చిన ఇబ్బందేంటి?

మద్యం మాఫియాలా తయారైంది

పూర్తి మద్యపాన నిషేధం చేసేదాకా ఓట్లు అడగనన్నారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మద్యం అమ్ముతున్నారు. రాష్ట్రంలో 25% మంది లివర్‌, కిడ్నీలు చెడిపోయి చనిపోతున్నారు. దీనికెవరు జవాబుదారీ? హెల్త్‌ ఆడిట్‌ లేదు.. పన్ను ఆడిట్‌ లేదు.. అంతా నగదు అంటున్నారు.. ఏ ట్యాక్స్‌ ఎంత? అంతా మాఫియాలా తయారైంది. ఇది జగన్‌మోహన్‌రెడ్డి మార్కు రాజకీయం. ఆయన పాలనకు రాజశేఖరరెడ్డ్డి పాలనకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img