డ్వాక్రా వ్యవస్థ స్ఫూర్తినీ దెబ్బతీశారు

తెదేపా హయాంలో ఏర్పాటైన డ్వాక్రా సంఘాల ఆలంబనగా మహిళలు సాధికారత సాధిస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Published : 03 Dec 2022 04:14 IST

మీ శక్తి ఏంటో జగన్‌కు చూపించండి
కొవ్వూరులో మహిళలతో  భేటీలో చంద్రబాబు

తెదేపా హయాంలో ఏర్పాటైన డ్వాక్రా సంఘాల ఆలంబనగా మహిళలు సాధికారత సాధిస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అభయహస్తం పోయింది, స్త్రీనిధి పోయింది... మహిళలను సమావేశాలకే పరిమితం చేశారని మండిపడ్డారు. జగన్‌కు మహిళాశక్తి అంటే ఏంటో చూపించాలని మహిళలకు ఆయన పిలుపునిచ్చారు. కొవ్వూరులో డ్వాక్రా, వివిధ వర్గాల మహిళలతో శుక్రవారం మాటామంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఒకటే విన్నవిస్తున్నా... తాత్కాలిక ప్రలోభాలకు గురికావద్దు. జగన్‌ డబ్బులిస్తున్నాడని భావిస్తున్న వారంతా ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం వల్ల వచ్చిన లాభమెంత... మోపిన భారమెంత అని బేరీజు వేసుకోవాలి. ఇచ్చే డబ్బులకు.. దోచుకునే డబ్బులకు ఎక్కడా పొంతనే లేదు. లేని దిశ చట్టాన్ని తెచ్చాడు.. అది మనుగడలో ఉందా? ఆడబిడ్డలకు ఎన్టీఆర్‌ తొలిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఆస్తిలో సమాన హక్కు కూడా కల్పించారు. సమైక్యాంధ్రలో నేను 90 లక్షల మందిని డ్వాక్రా సంఘాల్లో చేర్పించా. మహిళల ఆత్మగౌరవం పెంచడానికి ఇంటికో మరుగుదొడ్డి కట్టిస్తే.. ఆ మరుగుదొడ్డికి ఇప్పుడు సీఎం పన్ను వేస్తున్నాడు. ఇలాంటి విషయాలన్నీ మహిళలు గమనించి జగన్‌కు గుణపాఠం చెప్పాలి’ అని చంద్రబాబు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని