ధరణి, భూసమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం

రాష్ట్రంలో ధరణి, పోడు భూములు, ఇతర భూసమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Updated : 03 Dec 2022 06:35 IST

5న జిల్లా కేంద్రాల్లో భారీగా పోరుబాట
పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధరణి, పోడు భూములు, ఇతర భూసమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పోడు భూముల సమస్య పరిష్కరించకుండా, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని పార్టీ ముఖ్యనేతలు ఆరోపించారు. ఈ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణతో సర్కారుతో పోరాడాలని కాంగ్రెస్‌ తీర్మానించింది. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగం ఛైర్మన్‌ కొప్పుల రాజు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, నాయకులు మల్లురవి, అనిల్‌, చెరుకు సుధాకర్‌, హెచ్‌. వేణుగోపాల్‌, ప్రీతం తదితరులు పాల్గొన్నారు. సునీల్‌ కనుగోలు ధరణికి సంబంధించి ఇచ్చిన వివరాలపై సమావేశంలో చర్చించారు.‘‘పేదల భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదు. ధరణి సహా రైతుల సమస్యలపై ఇప్పటికే మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పోరుబాట నిర్వహించాం. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన జిల్లా కేంద్రాల్లో ఇదే కార్యక్రమాన్ని భారీగా నిర్వహిద్దాం’’ అని సమావేశంలో నిర్ణయించారు. రైతుల ఇబ్బందులపై, భూ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే చూపే పరిష్కారాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగిన కార్యాచరణ గురించి కూడా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా మండలానికి ఐదుగురి చొప్పున కాంగ్రెస్‌ కీలక కార్యకర్తలు లేదా నాయకుల్ని ఎంపిక చేసి వారికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో మూడు వేల మంది ఎంపిక చేసిన కార్యకర్తలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.


భూ రికార్డుల సవరణపై విచారణ చేయించండి

ఈనాడు, దిల్లీ: ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో భూ రికార్డుల సవరణలో జరిగిన అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర భూ వనరుల విభాగం కార్యదర్శి అజయ్‌ టిర్కీకి కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని శుక్రవారం వారు ఇక్కడ కలిశారు. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని, ఆ నిధుల దుర్వినియోగంపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, కోదండరెడ్డి, దామోదర్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ పోర్టల్‌తో పేదల భూములను ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని