ఇప్పటికి విఫల నేతనే.. ఎప్పటికీ కాదు

‘ప్రస్తుతం నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తా. కానీ ఎప్పటికీ నేను ఓడిపోయిన వ్యక్తిని కాను. అపజయం కూడా సగం విజయమే అనుకుంటా. నేను కనీసం ప్రయత్నం చేశా.

Updated : 04 Dec 2022 08:14 IST

అపజయం కూడా సగం విజయమే
దేశం కోసమే రాజకీయాలు.. సినిమాలు జీవితం కోసమే
సీఏ విద్యార్థులతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-మాదాపూర్‌: ‘ప్రస్తుతం నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తా. కానీ ఎప్పటికీ నేను ఓడిపోయిన వ్యక్తిని కాను. అపజయం కూడా సగం విజయమే అనుకుంటా. నేను కనీసం ప్రయత్నం చేశా. జయాపజయాలను సమానంగా స్వీకరించాలి. సినిమా నేను కోరుకున్నది కాదు.. నా ఆలోచనలు, ఆశయాలు వేరే. సినిమాల్లో నటించేది నా జీవితం కోసమే. రాజకీయాలు మాత్రం దేశం, జాతి కోసమే’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఎవరికి వారే రోల్‌మోడల్‌గా ఎదగాలన్నారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా జీవితాన్ని కొనసాగించాలన్నారు. ప్రతికూల పరిస్థితులే మరింత బలంగా మారుస్తాయని, కఠిన పరిస్థితులే మరింత రాటుదేలేలా చేస్తాయని మరవద్దన్నారు. ఈ పరిస్థితులే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా తయారు చేస్తాయని విద్యార్థులకు బోధించారు. హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సమావేశంలో పవన్‌కల్యాణ్‌ ప్రసంగించారు. తెలివితేటలు ఉన్న వ్యక్తి మొదట చేసే పని... తెలివితక్కువ వ్యక్తి చివరిగా చేస్తాడనే మోతీలాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఎండీ మోతీలాల్‌ ఓస్వాల్‌ మాటలను ఆయన ఉటంకించారు. ఇంకా ఏమన్నారో పవన్‌కల్యాణ్‌ మాటల్లోనే... ‘‘విజయం కోసం ఎదురుచూసే వ్యక్తులు తప్పకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అధిగమించాలి. చాలామంది జనాలకు తక్షణ విజయాలు కావాలి. మార్పు ఒక్క రోజులో రాదని తెలుసుకోవాలి. అందుకు ఓపిక, సహనం ఉండాలి. ప్రస్తుతం నా మిషన్‌ యువతను శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ గడిపే బదులు, దీన్ని మార్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయడమే నా లక్ష్యం. నేను ఎప్పుడూ ఆదాయం సమకూర్చుకునే జీవితాన్ని కోరుకోను. అనుభూతితో కూడిన జీవితాన్ని కోరుకుంటాను. విజయం సాధించే మనిషిగా ఉంటావా, విలువలు కాపాడే వ్యక్తిగా ఉంటావా అని ఎవరైనా అడిగితే రెండూ కోరుకుంటా అని చెబుతాను. నా మొదటి సినిమా అపజయం తర్వాత నిరుత్సాహపడలేదు. నా విజయాల గ్రాఫ్‌ ఏడో సినిమా తర్వాతే పెరిగింది. మీరు 1.5 బిలియన్ల ప్రజలతో పోటీపడాలి కాబట్టి ముందుకొచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోవాలి. నేను జీవితంలో ఆరేడేళ్ల పాటు అపజయాలే చూశాను. ఆ తర్వాతే గబ్బర్‌సింగ్‌ విజయం వచ్చింది.’’

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని