గుజరాత్‌లో కమలంపై నిశ్శబ్ద విప్లవం

గుజరాత్‌లో 27 ఏళ్ల భాజపా పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు నిశ్శబ్దంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Published : 04 Dec 2022 05:12 IST

‘రావణ్‌’ వ్యాఖ్యల వక్రీకరణ : ఖర్గే

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో 27 ఏళ్ల భాజపా పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు నిశ్శబ్దంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అహ్మదాబాద్‌ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన ‘రావణ్‌’ వ్యాఖ్యలను కమలం నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తూ రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ.. 51 ఏళ్లుగా పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్న తనకు విధానాలపై మాట్లాడటం మాత్రమే తెలుసని, వ్యక్తిగత దాడులు ఎరుగనన్నారు. 27 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. ఈ స్థాయిలో ప్రచారం చేయడం అనవసరమన్నదే తన అభిప్రాయమన్నారు.

ఇతరుల ఆదేశంతోనే బరిలో ఆప్‌

గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 181 సీట్లలో పోటీ చేస్తున్న ఆప్‌ గురించి తనకున్న సమాచారం మేరకు.. కాంగ్రెస్‌ను బలహీనపరచడమే వారి లక్ష్యమని ఖర్గే అన్నారు. ఎవరో ఆదేశిస్తే ఆప్‌ ఇక్కడ పోటీ చేస్తోందని, ఇంతకుమించి తాను నిజాలు మాట్లాడితే కాంగ్రెస్‌పై మరింత దుష్ప్రచారం చేస్తారని తెలిపారు. అన్నాహజారే ఉద్యమం నుంచి పుట్టిన ఆ పార్టీకి గుజరాతీ, ఆంగ్ల పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు తెలియదన్నారు.

కాంగ్రెస్‌కు అజ్ఞాత ఓటర్ల మద్దతు

గుజరాత్‌లోని గిరిజన, గ్రామీణ, వెనుకబడ్డ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ కనిపిస్తోందని ఖర్గే చెప్పారు. ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగితల కారణంగా ఉన్నతవర్గాల ప్రజలు సైతం భాజపాతో విసిగిపోయారని.. అయినా భయం కారణంగా ఎవరూ బయటపడటం లేదన్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తారన్న ఆందోళన ప్రజల్లో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు ఈ అజ్ఞాత ఓటర్ల మద్దతు ఉందని, 1978 నాటి చిక్‌మగలూర్‌ లోక్‌సభ ఎన్నికలోనూ ఇందిరాగాంధీ ఇలాగే పునరాగమన విజయం సాధించారని ఖర్గే గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని