అక్కసుతోనే వైకాపా కార్యకర్తల విధ్వంసం

రాష్ట్రంలో వైకాపా నాయకుల దాడులు, వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయని, దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్న వారిపై లాఠీ ఝుళిపించాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

Published : 06 Dec 2022 04:48 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైకాపా నాయకుల దాడులు, వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయని, దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్న వారిపై లాఠీ ఝుళిపించాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బాధితులపైనే అక్రమంగా కేసులు మోపుతున్నారని వెల్లడించారు. ‘‘రాజకీయాల్లో భౌతిక దాడులు, విధ్వంసాలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరంగా మారతాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో జనసేన నాయకుడు రామచంద్రయాదవ్‌ ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైకాపాకు వ్యతిరేకంగా సభ తలపెట్టారనే అక్కసుతోనే వైకాపా కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. వైకాపా శ్రేణులు దాడులకు తెగబడుతూంటే పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం విచారకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు విమర్శలను స్వీకరించలేని అసహనస్థితికి చేరడం బాధాకరం...’’ అని రామకృష్ణ పేర్కొన్నారు.


వైకాపాది ‘రాయలసీమను వంచించే గర్జన’

తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు

ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే వైకాపా వాళ్లు రాయలసీమ గర్జన పేరుతో నాటకాలాడుతున్నారని తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. ‘‘న్యాయరాజధాని పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వైకాపాలోని రాయలసీమ ప్రజాప్రతినిధులు జగన్‌రెడ్డి చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. కర్నూలులో హైకోర్టు పెడితే రాయలసీమంతా ఎలా అభివృద్ధి చెందుతుందో ముందు వైకాపా వాళ్లు చెప్పాలి. న్యాయస్థానం ఏర్పాటు చేస్తే.... పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయా?..’’ అని ఆయన ప్రశ్నించారు.


బుందేల్‌ఖండ్‌ లాంటి ప్యాకేజీ ఎందుకు తేలేదు

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు

నిజంగా జగన్‌రెడ్డికి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీని ఎందుకు తేలేకపోయారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌
చినబాబు ప్రశ్నించారు. ‘‘సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు నిర్మించలేదు? చేతనైతే రాయలసీమకు పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. తప్ప ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేయకూడదు...’’ అని పేర్కొన్నారు.


కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై ఎందుకు ప్రతిపాదనలు పంపలేదు?

తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి

కర్నూలులో హైకోర్టు పెట్టాలని కేంద్రానికి, సంబంధిత శాఖకు ఇప్పటి వరకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘కర్నూలులో పెట్టాల్సిన జుడీషియల్‌ అకాడమీని మంగళగిరికి ఎందుకు తరలించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు తరలింపుపై చేసిన వ్యాఖ్యలపై జగన్‌ ఏం సమాధానం చెబుతారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే గర్జనల పేరుతో వైకాపా నేతలు నాటకాలాడుతున్నారు...’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని