భాజపా పాలిత రాష్ట్రాల్లో రూ.వెయ్యికి మించని పింఛను

డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటూ గొప్పలు చెప్పుకొనే భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా దివ్యాంగులకు పింఛను వెయ్యి రూపాయలకు మించలేదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 06 Dec 2022 06:21 IST

మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటూ గొప్పలు చెప్పుకొనే భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా దివ్యాంగులకు పింఛను వెయ్యి రూపాయలకు మించలేదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రూ.600 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం సిద్దిపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల శాఖను ఇతర సంక్షేమ శాఖల నుంచి ఇటీవల వేరు చేశామని, త్వరలోనే ప్రతి జిల్లాకు అధికారులను నియమిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ అత్యధికంగా నెలకు రూ.3016 పింఛను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5,69,712 మంది లబ్ధి పొందుతున్నారని, అందుకు ఏటా రూ.1700 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. గల్లీల్లో తిరిగే భాజపా నేతలను పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రశ్నించాలన్నారు. దివ్యాంగులకు ఇప్పటికే వివిధ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, విద్యారంగంలోనూ 3 నుంచి 5 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. దివ్యాంగురాలైన మహిళ వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు మొత్తం రూ.2.25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల శాఖ డైరెక్టర్‌ శైలజ, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్‌లో రూ.12.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు