బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి...

రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 08 Dec 2022 04:50 IST

తెరాస ఎంపీలు రంజిత్‌రెడ్డి, నామా, మన్నె

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు నిల్వలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇక్కడ సింగరేణి సంస్థ ఉండగా గనులను ఎందుకు వేలం  వేస్తున్నారని ప్రశ్నించారు. నాలుగు గనులు వేలం పెడితే ఒక్క కోయగూడెం గనిని మాత్రమే ప్రైవేటు సంస్థ దక్కించుకుందని, మిగతా మూడింటికి స్పందన లేదన్నారు. సింగరేణి సంస్థలో 51 శాతం వాటా ఉన్న   రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండానే కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరైనది  కాదన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణిని ప్రైవేటుపరం చేయొద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటుపరం చేయమని చెప్పారని, ఇప్పుడేమో ఒక్కో గనిని వేలం వేసుకుంటూ పోవడమేమిటని ప్రశ్నించారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాస్తే దానికి స్పందన లేదని ఆయన మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని