Punjab Election 2022: మాల్వా చిక్కితే.. పంజాబ్‌ దక్కినట్లే!

ఎన్నికల కాక రాజుకున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికార పీఠం చేజిక్కించుకోవడం సంప్రదాయంగా వస్తోంది! అందుకే ఇక్కడ చక్రం తిప్పేందుకు అన్ని ప్రధాన పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Updated : 24 Jan 2022 11:12 IST

అన్ని పార్టీల గురి ఆ ప్రాంతంపైనే..

చండీగఢ్‌: ఎన్నికల కాక రాజుకున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికార పీఠం చేజిక్కించుకోవడం సంప్రదాయంగా వస్తోంది! అందుకే ఇక్కడ చక్రం తిప్పేందుకు అన్ని ప్రధాన పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలుగా పంజాబ్‌ విడివడి ఉంది. వీటిలో మాల్వా అతిపెద్దది. ఇక్కడ 69 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించే పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం రివాజు! 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్వాలో 34 సీట్లు దక్కించుకున్న శిరోమణి అకాలీదళ్‌ అధికార పీఠమెక్కింది. నాడిక్కడ కాంగ్రెస్‌ 31 స్థానాలకు పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఇక్కడ అకాలీదళ్‌ తేలిపోయింది. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 18 సీట్లతో సత్తాచాటింది. 40 నియోజకవర్గాల్లో జయభేరి మోగించిన కాంగ్రెస్‌.. రాష్ట్రంలో పరిపాలనా పగ్గాలు దక్కించుకుంది.

అభివృద్ధి పథంలో వెనకంజే

పంజాబ్‌ చరిత్రలో అత్యధిక మంది ముఖ్యమంత్రులు మాల్వా నుంచే వచ్చారు. అయినప్పటికీ దొవాబా, మాఝాలతో పోలిస్తే ప్రగతి పథంలో ఈ ప్రాంతం వెనుకబడింది. సాధారణంగా అక్షరాస్యత శాతాన్ని అభివృద్ధికి ఓ ప్రధాన కొలమానంగా భావిస్తుంటారు. అది దొవాబాలో 81.48%, మాఝాలో 75.9%గా ఉండగా.. మాల్వాలో కేవలం 72.3%గా ఉంది. లింగ నిష్పత్తి పరంగా చూసినా మిగతా రెండు ప్రాంతాల కంటే మాల్వాది వెనకడుగే. ప్రగతి లోపించడంతో స్థానిక యువత ఉపాధి కోసం విదేశాల బాటపడుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న విమర్శలున్నాయి. రాజకీయ పార్టీలు మాల్వాను కేవలం తమకు అధికారాన్ని కట్టబెట్టే సాధనంగా చూస్తూ.. ఆ ప్రాంత అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయని మాజీ సమాచార కమిషనర్‌ చంద్రప్రకాశ్‌ తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు సంఘాలకు గట్టి పట్టు

మాల్వాలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌ సిద్ధూపుర్‌ వంటి రైతు సంఘాలకు గ్రామ స్థాయుల్లో గట్టి పట్టు ఉంది. లక్షల మంది రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సాగుచట్టాలపై పోరులో చురుగ్గా పాల్గొన్న అన్నదాతలు ఈ దఫా ఎలా స్పందిస్తారు? ఏ పార్టీని ఆదరిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు- డేరా సచ్ఛ సౌధా కూడా మాల్వా ఓటర్లను ప్రభావితం చేయగలదు. అందుకే ఆ సంస్థ కార్యకలాపాల్లో రాజకీయ నాయకులు తరుచుగా పాల్గొంటుంటారు.


ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలు/కూటములు

* ఆప్‌ 

* అకాలీదళ్‌-బీఎస్పీ

* భాజపా-పీఎల్‌సీ-శిరోమణి అకాలీదళ్‌ (యునైటెడ్‌)

* సంయుక్త సమాజ్‌ మోర్ఛా (ఎస్‌ఎస్‌ఎం)


మాల్వాలో ప్రధాన సమస్యలు

* తాగునీటి కొరత

* రైతుల ఆత్మహత్యలు

* నిరుద్యోగం

* ఇసుక ధరల్లో భారీ పెరుగుదల

* మాదకద్రవ్యాల అక్రమ రవాణా


పంజాబ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు  117

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస సీట్లు 59

ఎన్నికల తేదీ ఫిబ్రవరి 20 (ఒకే విడతలో)

ఫలితాలు మార్చి 10న 


పంజాబ్‌లో ప్రాంతాలవారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు
మాల్వా    69
మాఝా   25
దొవాబా   23


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని