అదుపులోకి తీసుకుని.. అర్ధరాత్రి విడుదల

మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా

Updated : 25 Jan 2022 05:56 IST

బుద్దా వెంకన్నను పోలీసులు తీసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత

ఈనాడు- అమరావతి, విద్యాధరపురం, న్యూస్‌టుడే: మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని తెదేపా నేతలు అభ్యంతరం తెలపడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల మోహరింపు, తెదేపా కార్యకర్తల ప్రతిఘటనల మధ్య వెంకన్నను ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సోమవారం రాత్రి వరకు ఆయన్ను విచారించారు. అనంతరం ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రాత్రి 11.15 గంటల సమయంలో విడిచిపెట్టారు. అంతకుముందు సోమవారం ఉదయం 11గంటలకు తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, నాయకులతో కలిసి బుద్దా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.మంత్రి కొడాలి నాని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని బుద్దా వెంకన్న ఉదయం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీజీపీ వాటా ఎంతని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్‌ ఆఫ్‌ జగన్‌ పార్టీ అంటూ ధ్వజమెత్తారు.   మంత్రి అనుచరుడు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్దా వెంకన్నపై పోలీసు కేసు నమోదైంది. రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు సెక్షను 153ఏ, భయోత్పాతం సృష్టించినందుకు సెక్షన్‌ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505(2) రెడ్‌విత్‌ 34 కింద కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని