ఇది గుజరాత్‌ కాదు.. చైతన్య తెలంగాణ

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనలో మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, రాష్ట్రానికి పైసా ఇవ్వకపోగా ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడారని రాష్ట్ర మంత్రులు, నేతలు విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.

Published : 27 May 2022 04:54 IST

మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట- న్యూస్‌టుడే, ఈనాడు- హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనలో మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, రాష్ట్రానికి పైసా ఇవ్వకపోగా ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడారని రాష్ట్ర మంత్రులు, నేతలు విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఆయనకు అమరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గురువారం ప్రధాని పర్యటన ముగిసిన అనంతరం మంత్రి హరీశ్‌ సిద్దిపేటలోనూ.., మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డిలు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు హైదరాబాద్‌లోనూ వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. హరీశ్‌ మాట్లాడుతూ ‘‘ఇది గుజరాత్‌ కాదు.. పోరాటాల గడ్డ. చైతన్యవంతమైన తెలంగాణలో గుజరాత్‌ మాదిరి ప్రజలు మోసపోరు. తెలంగాణవాసుల ఆశీర్వాదంతో గెలిచిన తెరాసపై ప్రధాని మోదీ.. కుటుంబ పార్టీగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కడుపునిండా విషంతో అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్‌ నమ్మకానికి, మోదీ అమ్మకానికి మారుపేరు. నాడు తెలంగాణ రాకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయబోగా.. నేడు భాజపా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన బీఆర్‌జీఎఫ్‌ నిధులు రూ.1500 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.6 వేల కోట్లు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన కింద రావాల్సిన రూ.1500 కోట్లదీ అదే తీరు. కుటుంబ రాజకీయాలంటూ మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అమిత్‌షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శిగా, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు దుష్యంత్‌సింగ్‌ ఎంపీగా.., పీయూష్‌గోయల్‌ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు కదా.. అభివృద్ధిలో గుజరాత్‌ను తెలంగాణ మించిపోతుందని, నిధులు ఇవ్వకుండా, అనుమతులు రాకుండా అడ్డుపడుతున్నారు’’ అని అన్నారు.

కేంద్రంలో మాటలే తప్ప చేతలేవీ

ఇతర మంత్రులు మాట్లాడుతూ.. ‘‘కేంద్రంలో భాజపా ప్రభుత్వానివి మాటలే తప్ప, చేతలు లేవు. రాష్ట్రంలో అధికారంఅంటూ మోదీ అత్యాశకు పోతున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ భాజపాకు చోటులేదు. మేం ముందు ఊహించినట్లుగానే రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపారు. రాజకీయ లబ్ధి కోసం ఊకదంపుడు ఉపన్యాసం చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత కేంద్రానిదే. కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేశారు. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ.. యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భాజపా పాలిత రాష్ట్రాలను తెలంగాణ సాకుతుంటే మోదీకి ఆ విశ్వాసం లేదు. కొత్త సచివాలయం గురించి మాట్లాడుతున్న ప్రధాని.. మరి పార్లమెంట్‌ భవనం ఎందుకు కడుతున్నారో వివరించాలి. పాలనను విస్మరించి దేవుని పేరిట మతోన్మాదం సృష్టించడమే భాజపా ధ్యేయం’’అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని