Gujarat: ఆ అల్లర్ల కేసు దోషి కుమార్తెకు భాజపా టికెట్‌..!

అహ్మదాబాద్‌లోని నరోడా అసెంబ్లీ స్థానం నుంచి పాయల్‌బెన్‌ కుకరాణీని భాజపా పోటీకి దింపింది. ఆమె నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషిగా తేలిన మనోజ్‌ కుకరాణీ కుమార్తె కావడం గమనార్హం.

Updated : 12 Nov 2022 14:53 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ఇటీవల అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో గోద్రా అల్లర్ల తర్వాత చోటుచేసుకున్న నరోడా పాటియా అల్లర్ల ఘటనలో దోషిగా ఉన్న వ్యక్తి కుమార్తెకు కాషాయ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని నరోడా అసెంబ్లీ స్థానం నుంచి పాయల్‌బెన్‌ కుకరాణీని భాజపా పోటీకి దింపింది.

30 ఏళ్ల పాయల్‌ తండ్రి మనోజ్‌ కుకరాణీ.. నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషిగా తేలాడు. 2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్ల తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఓ వర్గానికి చెందిన 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మనోజ్ సహా 16 మంది దోషులుగా తేలుస్తూ కింది కోర్టులు తీర్పునిచ్చాయి. 2018లో వీరి శిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో జీవితఖైదు పడిన మనోజ్‌.. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు.

నరోడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బలరామ్‌ తవానీని పక్కనబెట్టి.. కమలం పార్టీ పాయల్‌కు టికెట్ ఇవ్వడం గమనార్హం. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుల్లో పాయల్‌ కూడా ఒకరు. ఆమె తల్లి రేష్మ స్థానిక కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. నరోడా ప్రాంతంలో బలమైన వర్గంగా ఉన్న సింధి కమ్యూనిటీకి చెందిన పాయల్‌.. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. 1990 నుంచి నరోడా అసెంబ్లీ స్థానంలో భాజపా విజయం సాధిస్తూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని