Tejashwi Yadav: ఆ పార్టీలన్నీ బయటకు వచ్చాక.. ఇంకా ఎన్డీఏ కూటమి ఎక్కడిది..?

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి (NDA) లేదని ఆర్జేడీ నేత, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పేర్కొన్నారు.

Published : 26 Sep 2022 01:57 IST

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌

ఫతేహాబాద్‌: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి (NDA) లేదని ఆర్జేడీ నేత, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పేర్కొన్నారు. అందులో నుంచి జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, శివసేన పార్టీలు బయటకు వచ్చాక ఇంకా ఎన్డీఏ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ (INLD) వ్యవస్థాపకుడు, మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఆ పార్టీలు ఎన్డీయే కూటమిని వీడాయన్నారు.

భాజపా తప్పుడు వాగ్దానాలు, అసత్య ప్రచారాలు చేస్తోందని తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. అందుకే ఆ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ కాదని.. పెద్ద అబద్దాల పార్టీ (బడ్కా ఝుఠా పార్టీ) అని అన్నారు. ఇటీవల బిహార్‌ పర్యటనకు వచ్చిన అమిత్‌ షా.. పుర్నియాలో విమానాశ్రయం గురించి మాట్లాడారని.. వాస్తవానికి అక్కడ విమానాశ్రయమే లేదన్నారు. వేదికపైనున్న జేడీయూ నేత నీతీశ్ కుమార్‌, శిరోమణి అకాలీదళ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌బాదల్‌, శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ పేర్లను ప్రస్తావించిన తేజస్వి యాదవ్‌.. వీరంతా గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్నావారేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఆ కూటమి నుంచి వీరంతా బయటకు వచ్చారన్నారు. ఇటువంటి సమయంలో ఇంకా ఎన్డీయే ఎక్కడుందని ప్రశ్నించారు.

ఘర్షణలను కోరుకునేది భాజపానే..

కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తోన్న పలు పార్టీలు నేడు ఒకే వేదికపైకి వచ్చాయి. హరియాణాలోని ఫతేహాబాద్‌లో ఐఎన్‌ఎల్‌డీ నిర్వహించిన సభకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, శివసేన, సీపీఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నీతీశ్‌ కుమార్‌.. దేశంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు లేవని.. కేవలం గందరగోళం సృష్టించడానికే భాజపా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులతో సహా విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని