Kejriwal: ఉత్తరాఖండ్‌ ప్రజలు ఉచిత విద్యుత్‌ పొందలేరా?

ఆమ్‌ ఆద్మీ పార్టీని దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంపై దిల్లీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీరియస్‌గా దృష్టిసారించారు......

Published : 11 Jul 2021 01:09 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీని దేశంలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించడంపై దిల్లీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీరియస్‌గా దృష్టిసారించారు. ఇటీవల గుజరాత్ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ఉత్తరాఖండ్‌ పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనకు ముందు రోజు ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ఉత్తరాఖండ్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ.. అక్కడి ప్రజలకు మాత్రం విద్యుత్‌ ఖరీదుగా మారిపోయిందని విమర్శించారు. దిల్లీలో ఉచిత విద్యుత్ అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

‘‘ఉత్తరాఖండ్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకూ విక్రయిస్తోంది. మరి అలాంటప్పుడు, ఉత్తరాఖండ్‌ ప్రజలకు విద్యుత్‌ ఎందుకంత ఖరీదుగా మారింది? దిల్లీ సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మరీ దేశ రాజధాని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. ఉత్తరాఖండ్‌ ప్రజలు ఉచిత విద్యుత్‌ పొందలేరా? దేహ్రాదూన్‌లో రేపు కలుద్దాం..’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  

ఇటీవల పంజాబ్‌ పర్యటన సందర్భంలోనూ కేజ్రీవాల్‌ ఉచిత విద్యుత్ అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ  ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే గృహ అవసరాల కోసం 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 24గంటల పాటు విద్యుత్‌ అందిస్తామన్నారు. ఇది కేజ్రీవాల్‌ మాట.. అమరీందర్‌ సింగ్‌లా బడాయి ప్రతిజ్ఞ కాదు’’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దిల్లీలో వరుస విజయాలతో సత్తా చాటిన కేజ్రీవాల్‌‌.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో తన ముద్ర వేయాలనే సంకల్పంతో వ్యూహాలు రచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని