AP News: ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి.. ఏపీ వ్యాప్తంగా నిరసనలు

‘ఈనాడు’ కర్నూలు ప్రాంతీయ కార్యాలయంపై దాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Updated : 21 Feb 2024 14:08 IST

అమరావతి: ‘ఈనాడు’ కర్నూలు ప్రాంతీయ కార్యాలయంపై దాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. జర్నలిస్టులకు తెదేపా, జనసేన, వామపక్షాల నేతలు సంఘీభావం తెలిపారు. దాడికి నిరసనగా ఓర్వకల్లులో తెదేపా ఆందోళన చేపట్టింది. కాటసానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దాడికి పాల్పడిన వైకాపా నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కడప అంబేడ్కర్‌ కూడలి వద్ద జర్నలిస్టు సంఘాలు, తెదేపా, ప్రజా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛపై దాడి.. ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే ధర్నా చేపట్టింది.

భయానక వాతావరణంతో ఎన్నికల్లో లబ్ధికి జగన్‌ యత్నం: అచ్చెన్న

దాడి ఘటనను తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. పాత్రికేయులు, పాత్రికేయ సంస్థలపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడేనని ఆయన పేర్కొన్నారు. భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో లబ్ధికి జగన్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అని ప్రశ్నించారు. విచారణ చేసి వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము 160 స్థానాల్లో పూర్తి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈనాడు కార్యాలయంపై దాడిని తెదేపా నేత మన్నవ మోహనకృష్ణ ఖండించారు. జగన్‌ ప్రభుత్వంలో పత్రికా కార్యాలయాలపై దాడులు పెరిగాయన్నారు. జగన్‌ హింసాత్మక ధోరణికి రాష్ట్రం గుండారాజ్‌గా మారిందని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ కాపాడేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని