Kishan Reddy: మరోసారి మోదీ ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరు: కిషన్‌రెడ్డి

ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారాస, కాంగ్రెస్‌ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 21 Feb 2024 12:25 IST

మక్తల్‌: ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారాస, కాంగ్రెస్‌ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు భారాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ ఛార్జిషీట్‌ ప్రకటించిందని.. వాటి ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మక్తల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌, భారాస.. రెండూ కుటుంబ పార్టీలే. ఈ ఎన్నికల్లో పోటీకి భారాసకు ఎలాంటి అజెండా లేదు. ఆ పార్టీకి ఒక్క సీటూ రాకపోయినా జనానికి వచ్చే నష్టం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని అన్ని ఎంపీ సీట్లు, కర్ణాటకలో 25 సీట్లు భాజపా గెలవబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3-4 సీట్లు గెలిచినా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. మోదీ మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరు. తెలంగాణలో భాజపా అత్యధిక సీట్లు గెలవకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. ఆ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. సోనియా కుటుంబానికి సేవ తప్ప.. హామీల అమలుపై వారికి దృష్టి లేదు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలులోకి తీసుకొస్తారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లు అవసరమో.. ఎలా సమకూర్చుకుంటారో ప్రజలకు వివరించాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారు?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని