MLC Elections: ‘ఎకానమీ చిరంజీవి’... వైకాపాకు షాకిచ్చిన ఈ మాస్టారి గురించి తెలుసా?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు (vepada chiranjeevi rao) ఘన విజయం సాధించారు. ఎకానమీ చిరంజీవిగా సుపరిచితమైన ఆయన పలు సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు.

Updated : 18 Mar 2023 13:42 IST

ఆయనో విద్యావేత్త.. అర్థశాస్త్ర అధ్యాపకుడు.. రచయిత.. అసలు పేరు వేపాడ చిరంజీవిరావు (vepada chiranjeevi rao) అయినా ఎకానమీ చిరంజీవిగానే అందరికీ సుపరిచితుడు. తెదేపా (TDP) మద్దతుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉత్తరాంధ్ర) పట్టభద్రుల నియోజకవర్గ (North Andhra Graduates MLC) శాసనమండలి అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్లి సమీప ప్రత్యర్థి, వైకాపా (YCP) అభ్యర్థి అయిన  సీతంరాజు సుధాకర్‌కు గట్టి షాకిచ్చారు. అంచనాలను మించి తొలి ప్రాధాన్య ఓటులో భారీగా ఓట్లు సాధించినప్పటికీ.. గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లతో ఘన విజయం సాధించారు. శాసనమండలిలో తొలిసారి కాలు మోపేందుకు సిద్ధమవుతోన్న ‘ఎకానమీ చిరంజీవి (Economy Chiranjeevi)’ గురించి కొన్ని విశేషాలు..

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో 1972లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన (vepada chiranjeevi rao).. కొత్తకోటలో ఇంటర్‌ చదివారు. డిగ్రీ, బీఈడీ తర్వాత ఏయూ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. 1995లో ఏయూసెట్‌లో ప్రథమ ర్యాంక్‌ సాధించారు. 1996 డీఎస్సీలో ఎంపికై ఎస్‌జీటీగా కొలువు ప్రారంభించిన ఆయన ఆ తర్వాత స్కూలు అసిస్టెంట్‌, జూనియర్‌, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన భార్య నివేదిత విశాఖపట్నంలోని వీఎస్‌ కృష్ణ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

పోటీపరీక్షలకు పాఠాలు చెప్పి..

ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా 12 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన.. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఆరు పుస్తకాలు రాశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటారు. పేద విద్యార్థుల కోసం ఎకనమిక్స్‌ మెటీరియల్‌ను వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా అందిస్తున్నారు.

సేవలోనూ చురుగ్గా..

సామాజిక సేవలోనూ చిరంజీవి రావు ముందుంటున్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థికసాయం చేయడం, వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా విద్యార్థులకు ఎకనామిక్స్‌ బోధన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు.. లక్ష్యసాధనకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. కొవిడ్‌ సమయంలో పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేశారు. రోగులకు ఆర్థికసాయం చేశారు. ఏయూ పూర్వ విద్యార్థులతో కలిసి హుద్‌హుద్‌ తుపాను సమయంలో సేవలందించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ‘హెల్పింగ్‌ హ్యాండ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో తన భార్యతో కలిసి స్వగ్రామంలో 1300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని