Karnataka: అసెంబ్లీని కుదిపేసిన.. ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం ఘటన

కర్ణాటకలో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం ఘటన ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామిని కేబినెట్‌ నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

Published : 07 Jul 2023 01:39 IST

బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) నాగమంగళ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి (Chaluvarayaswamy)ని కేబినెట్‌ నుంచి తొలగించాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మంత్రి.. అతడిని బదిలీ చేయించారంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలను సిద్ధరామయ్య ఖండించారు. బదిలీలు సాధారణమేనని, దానికి రాజకీయ రంగుపులమడం సరికాదన్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఆర్టీసీ డ్రైవర్‌ జగదీశను నాగమంగళ డిపో నుంచి ముద్దూరు డిపోకు అత్యవసరంగా బదిలీ చేస్తూ ఆర్టీసీ అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఉన్నతాధికారులను సంప్రదించగా.. అతడిపై ఫిర్యాదులు ఉన్నాయని, పై నుంచి ఆదేశాలు రావడంతోనే బదిలీచేయాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన జగదీశ తన మృతికి వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించి ఆయన్ను మైసూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ జగదీశను ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కుమారస్వామి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి  చలువరాయస్వామి వేధింపుల వల్లే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. డ్రైవర్‌ భార్య గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారని.. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని మంత్రి పలుమార్లు కోరినా.. ఆమె వ్యతిరేకించారన్నారు. దీంతో ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలని భావించి.. ఆమె భర్తను బదిలీ చేయించారని కుమారస్వామి ఆరోపించారు. ప్రజల జీవితాలతో మంత్రులు ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాలనుకుంటే వెంటనే సదరు మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కుమారస్వామి ఆరోపణలపై హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర కూడా స్పందించారు. సీనియర్‌ పోలీసు అధికారులతో ఈ కేసును దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రవాణశాఖ అధికారులనూ దర్యాప్తులో భాగస్వాముల్ని చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని