IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్.. కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్‌ (Sunil Narine)పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు క్రీజులో కుదురుకుంటే ప్రమాదకరంగా మారతాడని పేర్కొన్నాడు. 

Updated : 06 May 2024 18:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్‌ (Sunil Narine) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. పేరుకు స్పిన్నరైనా స్టార్‌ బ్యాటర్‌లా సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అతడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ కోల్‌కతా భారీ స్కోర్లు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన అతడు.. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో(81; 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. ఈనేపథ్యంలో నరైన్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ ప్రశంసలు కురిపించాడు. అతడు క్రీజులో కుదురుకుంటే ప్రమాదకరంగా మారతాడని పేర్కొన్నాడు. 

‘‘ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్‌ను కట్టడి చేయడానికి లఖ్‌నవూ ఏదైనా ప్లాన్‌తో వచ్చిందో, లేదో తెలియదు. అతడికి బౌలింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రం ప్లాన్‌తో వచ్చినట్టు కనిపించలేదు. కోల్‌కతా బౌలర్లు ఎలా బౌలింగ్‌ చేసినా నరైన్‌ మైదానం నలువైపులా భారీ షాట్లతో చెలరేగాడు. అతడు ఒక్కసారి ఊపందుకొని క్రీజులో కుదురుకున్నాడంటే చాలా ప్రమాదకరంగా మారతాడు. నరైన్‌ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనలు చేస్తూ చాలా ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నాడు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకైతే ఈ సీజన్‌లో సునీల్‌ నరైన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని గ్రేమ్ స్మిత్ వివరించాడు. 

ఇదివరకు టాప్ ఆర్డర్ పవర్‌ హిట్టర్‌గా ఉన్న నరైన్‌ ఇప్పుడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారాడని ఆసీస్‌ మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. నరైన్‌ ఈ ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 183.67 స్ట్రైక్‌రేట్‌తో 461 పరుగులు చేశాడు.  అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నరైన్ ఇదే దూకుడు కొనసాగిస్తే అతడు టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని