6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్‌రెడ్డే కారణం

వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్‌రెడ్డే కారణమని ఆరోపించారు.

Published : 06 May 2024 06:10 IST

కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీని రెండో స్థానంలో నిలిపారు
ఎన్డీయే నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్‌రెడ్డే కారణమని ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీని దేశంలో రెండో స్థానంలో, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలిపారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయకపోవడంతో సూక్ష్మ, బిందుసేద్యానికి సంబంధించిన అనేక కేంద్ర పథకాలు ఆగిపోయాయని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, భాజపా మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆక్వా రంగంలో జోన్‌, నాన్‌జోన్‌ విధానాన్ని తెచ్చి విద్యుత్తు ఛార్జీలు, మేత ధరల్లో రాయితీలు ఎత్తేశారు. పెట్టుబడి రాయితీలివ్వడం లేదు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధిస్తున్నారు’ అని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక మోసం చేశారని శివశంకర్‌ మండిపడ్డారు. ‘ఏపీలో ఒక్కో రైతుపై రూ.2.40 లక్షల అప్పుల భారాన్ని మోపారు. 403 మండలాల్లో కరవు విలయతాండవం చేస్తుంటే కేవలం 106 మండలాల్నే కరవు మండలాలుగా ప్రకటించారు..’ అని దుయ్యబట్టారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతుల భూములు కాజేయడానికి జగన్‌ ప్రభుత్వం పన్నాగం పన్నిందని పాతూరి నాగభూషణం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని