BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు నుంచి 4జీ సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

Published : 06 May 2024 19:36 IST

దిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర భారత్‌’ అడుగులకు అనుగుణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఈ సేవలను తీసుకొస్తోంది. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టింది. ఇందులో 700 Mhz, 2100 Mhz స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌పై సెకనకు 40-45 ఎంబీ స్పీడ్‌ నమోదైనట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్గాలు తెలిపాయి.

పంజాబ్‌లో ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సర్వీసులను ప్రారంభించింది. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌, ప్రభుత్వరంగ పరిశోధన సంస్థ సీ-డాట్‌ కలిసి దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. పంజాబ్‌లో సీ-డాట్‌ అభివృద్ధి చేసిన సాంకేతికత మెరుగైన పనితీరును నమోదు చేస్తోందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ విస్తరణకు టీసీఎస్‌, తేజస్‌, ప్రభుత్వానికి చెందిన ఐటీఐ సంయుక్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ.19 వేల కోట్ల విలువైన ఆర్డర్‌ను గెలుచుకున్నాయి. 5జీ సేవల కోసం మళ్లీ వీటిని అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4జీ, 5జీ టవర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటుచేస్తోంది. గత నాలుగైదేళ్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీకి సపోర్ట్‌ చేసే సిమ్‌ కార్డులను విక్రయిస్తోంది. అంతకంటే పాత సిమ్‌లు ఉన్నవారు 4జీ సేవలను ఆనందించాలంటే.. కొత్త సిమ్‌కార్డు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని