
కేరళలో ఆ పార్టీలది ఫ్రెండ్లీ మ్యాచే: రాజ్నాథ్
కొచ్చి: కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
‘కేరళలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నాయి. కానీ, 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమబెంగాల్లో మాత్రం పొత్తు కుదుర్చుకుని స్నేహం కొనసాగిస్తున్నాయి. కేరళ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, లేదా యూడీఎఫ్ ఏది గెలిచినా అది ప్రజల ఓటమే అవుతుంది. ఆ రెండు కూటముల సమయం ముగిసింది. ప్రస్తుతం కేరళ ప్రజలకు వారి పొత్తులు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’ అని రాజ్నాథ్ విమర్శించారు. అంతేకాకుండా ఆ రెండు ఫ్రంట్లు ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీలు అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడవకుండా చేస్తున్నాయని రాజ్నాథ్ మండిపడ్డారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.