Congress: జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ.. రాహుల్‌ గాంధీ హాజరు

ఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రకటించారు. 

Updated : 28 Jun 2023 20:08 IST

కోదాడ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే ప్రకటించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిళ్లగూడెంలో భట్టి పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మాట్లాడారు. ఏఐసీసీ నిర్దేశించిన మేరకు భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పాదయాత్ర ముగింపు సభలో స్వయంగా రాహుల్‌ గాంధీ .. భట్టి విక్రమార్కను సన్మానిస్తారని తెలిపారు. జులై 2న ఖమ్మంలో లక్షలాది మందితో తెలంగాణ గర్జన సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.

ప్రజల బాగు కోసం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఠాక్రే విమర్శించారు. ప్రజల సంపదను కేసీఆర్‌ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి రూ.వేల కోట్లు ఎవరు ఇస్తున్నారని నిలదీశారు. కేసీఆర్‌ ఖర్చు పెడుతున్న ప్రతి పైసా తెలంగాణ ప్రజలది కాదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు మేలు చేసే విధంగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు