Politics: మరో పాతికేళ్లు అధికారంలో ఉంటాం: సుప్రియా సూలే

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల నేతలను టార్గెట్‌ చేస్తోందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో చూడలేదన్నారు.....

Published : 29 Aug 2021 01:21 IST

నాగ్‌పుర్‌: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల నేతలను టార్గెట్‌ చేస్తోందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నాగ్‌పుర్‌కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నిన్న భేటీ కావడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. రాజకీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి వారిద్దరూ భేటీ కావడాన్ని స్వాగతిస్తానన్నారు. ఓబీసీ కోటా అంశంపై ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ఫడణవీస్‌, ఠాక్రే దాదాపు 20 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. దీనిపై విలేకర్లు ఆమెను ప్రశ్నించగా.. సిద్ధాంతాలను పక్కనబెట్టి మంచి సంబంధాలు కొనసాగించడం మంచిదేనని అభిప్రాయపడ్డారు.  అలాంటి వాటిని తాను స్వాగతిస్తానన్నారు. 

మరో 25 ఏళ్లు అధికారంలో మేమే..
కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు నిలిపివేసినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరుచేస్తోందన్నారు. అంటే దీని అర్థం కేంద్ర ప్రభుత్వం కన్నా మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నట్టే కదా అంటూ విలేకర్లు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం మరో 25 ఏళ్ల వరకు రాష్ట్రాన్ని పాలిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని