సిద్ధూ ఇంటికి 60 మంది ఎమ్మెల్యేలు!

పంజాబ్‌ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. సిద్ధూను పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో రాజకీయాలు చల్లబడతాయనుకుంటే.. పరిస్థితి ఇప్పుడు మరింత రసవత్తరంగా..

Published : 21 Jul 2021 18:24 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. సిద్ధూను పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో రాజకీయాలు చల్లబడతాయనుకుంటే.. పరిస్థితి ఇప్పుడు మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం స్వర్ణ దేవాలయం సందర్శనకు పెద్దఎత్తున నేతలు తరలి రావాలన్న సిద్ధూ పిలుపునకు అనూహ్య స్పందన రావడం ఇందుకు కారణం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధూ నివాసానికి సుమారు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ విధంగా ఈ కార్యక్రమం బలప్రదర్శనను తలపించింది. అమృత్‌సర్‌లో పెద్దఎత్తున సిద్ధూ కటౌట్లు కూడా వెలియగా.. స్వర్ణ దేవాలయం వద్ద కూడా పార్టీ కార్యకర్తలతో జనసందోహం నెలకొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు సుక్జీందర్‌ సింగ్‌, త్రిప్త్‌ రాజీందర్‌ సింగ్‌ బజ్వా, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ జల్పూర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 2022 ఎన్నికల్లోనూ సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. పంజాబ్‌ మొత్తం అతడు కావాలని కోరుకుంటోందన్నారు. సిద్ధూ నియామకంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కూడా అమరీందర్‌ సింగ్‌ ఇప్పటి వరకు సిద్ధూను కలవలేదు. తనపై గతంలో చేసిన కామెంట్లపై క్షమాపణ చెబితే గానీ కలిసేది లేదని చెప్పారు. దీనిపై జల్పూర్‌ మాట్లాడుతూ.. సిద్ధూ నియామకాన్ని అమరీందర్‌ స్వాగతించాలన్నారు. గతంలో ఆయనను విమర్శించిన పలువురిని కలుస్తున్న అమరీందర్‌.. సిద్ధూ విషయంలో అలా చేయడం సరికాదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సిద్ధూ.. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సిద్ధూతో భేటీ విషయంలో అమరీందర్‌ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని ఆయన సలహాదారు ఒకరు తెలిపారు. 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 77 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని