Nitish Kumar: నీతీశ్‌ కీలక నిర్ణయం.. ఆర్జేడీ మంత్రుల తొలగింపు!

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన మంత్రివర్గంలో ఉన్న ఆర్జేడీకి చెందిన మంత్రుల్ని తొలగించి, వారి స్థానంలో భాజపాకి చెందిన ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించనున్నట్లు సమాచారం.

Published : 27 Jan 2024 22:30 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) అధినేత నీతీశ్‌ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన మంత్రివర్గంలో ఆర్జేడీకి చెందిన మంత్రుల్ని తొలగించి, వారి స్థానంలో భాజపాకి (BJP) చెందిన ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించనున్నట్లు సమాచారం. దీనిపై ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, భాజపాతో ఆయన మళ్లీ చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. భాజపా ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ మద్దతు లేఖలను ఆయనకు పంపినట్లు జేడీయూ వర్గాలు వెల్లడించాయి. అయితే, నీతీశ్‌ రాజీనామా చేయకుండానే మంత్రులను మారుస్తారా? లేదంటే.. భాజపా మద్దతుదారులతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై భాజపా అధిష్ఠానంతో ఇప్పటికే చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సంప్రదింపులు జరిపి.. ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే.. నీతీశ్ ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. జేడీయూ, భాజపా ఎమ్మెల్యేలకు ఆదివారం మధ్యాహ్నం ఆయన తన ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. అక్కడే ప్రభుత్వ ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న సుశీల్‌ కుమార్‌ మోదీయే మళ్లీ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆట ఇంకా మొదలుకాలేదు.: తేజస్వీ యాదవ్‌

తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ నేత, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆట మొదలు కాలేదని, త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. దీనిని బట్టి మహాగఠ్‌బంధన్‌లోని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. భాజపా, జేడీయూ కలిస్తే.. మ్యాజిక్‌ ఫిగర్‌ 122 కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు కలిస్తే మ్యాజిక్‌ ఫిగర్‌కు ఏడెనిమిది సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఊహించని పరిణామాలు ఎదురైతే.. ఈ పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని