icon icon icon
icon icon icon

ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..

ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం.

Updated : 03 May 2024 08:30 IST

మీట నొక్కడమే కాదు.. ఓటెవరికి పడిందో నిర్ధారించుకోవచ్చు
పోలింగ్‌ ప్రక్రియపై అవగాహనతో అనుమానాల నివృత్తి
‘ఈనాడు’ విజ్ఞప్తి మేరకు డెమో ఏర్పాటు చేసిన
ఎన్నికల సంఘం అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. ఐదేళ్లపాటు తన ప్రతినిధిగా కొనసాగే నేతను ఎన్నుకునేందుకు వేసే ఓటుపై ఓటరుకు ఎలాంటి సందేహం ఉండొద్దు. పోలింగ్‌ కేంద్రం వద్ద వరుసలో నిల్చొని.. కేంద్రం లోనికి వెళ్లాక ఈవీఎంపై ఉన్న ఏదో ఒక మీట నొక్కి వచ్చేస్తే సరిపోదు. తాను వేసిన ఓటు.. తాను వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న అనుమానానికి తావు లేకుండా.. నిర్ధారించుకోవడం అవసరం. ఇందుకోసం పోలింగ్‌ ప్రక్రియలో జవాబుదారీ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు నిర్ధారించుకునేందుకు వీలుగా ఓటింగ్‌ చీటీ(వీవీ ప్యాట్‌)ని ప్రదర్శిస్తోంది. అయితే, ఇటీవల కర్ణాటకలో జరిగిన పోలింగ్‌ సందర్భంగా ఓటింగ్‌ ప్రక్రియపై ఓ ఓటరు అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌ వైరల్‌ అయింది. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.

ఓటింగ్‌ ప్రక్రియ అత్యంత పారదర్శకమని.. దీనిపై అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు ఛైతన్యం కల్పించేందుకు డెమో(నమూనా) ప్రదర్శించాలని ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను ‘ఈనాడు’ కోరింది. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కేంద్రంలో అధికారులు నమూనా(మాక్‌) పోలింగ్‌ విధానాన్ని ప్రదర్శించారు. ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి.. ఓటర్లు తాము వేసిన ఓటును ఎలా పరిశీలించుకోవచ్చో వివరించారు.


ఓటరు చీటీ, గుర్తింపు కార్డుతో పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించాక.. మొదట పోలింగ్‌ అధికారి-1 వద్దకు వెళ్లాలి. ఓటరు వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో పరిశీలిస్తారు. ఓటరు పేరు, జాబితాలో వరుస సంఖ్యను గట్టిగా చదువుతారు. 

 ఆ కేంద్రంలో పార్టీల వారీగా ఉన్న పోలింగ్‌ ఏజెంట్లు ఆ ఓటరు పేరు, నంబరును తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలో సరిచూసుకుంటారు.


అక్కడి నుంచి పోలింగ్‌ అధికారి-2 వద్దకు ఓటరు వెళ్లాలి. అతని వద్ద ఉన్న చీటీలోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్‌లో సరిచూసుకుని.. సంతకం తీసుకుంటారు. ఓటరు నిరక్షరాస్యులైతే వేలిముద్ర తీసుకుంటారు. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు.

అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు రెండింటికీ ఎన్నికలు జరిగేచోట ఓటర్లకు ఎన్నికల అధికారులు రెండు వేర్వేరు రంగుల చీటీలు ఇస్తారు. వాటి ఆధారంగా రెండు బ్యాలెట్‌ యూనిట్లలో వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు.


ఓటింగ్‌ ప్రక్రియ ఇలా..

అనంతరం ఓటరు పోలింగ్‌ అధికారి-3 వద్దకు వెళ్లాలి. ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలిస్తారు. తన వద్ద ఉన్న కంట్రోల్‌ యూనిట్‌లో మీట నొక్కి.. ఓటును రిలీజ్‌ చేస్తారు.  (ఓటు రిలీజ్‌ చేయకముందు కంట్రోల్‌ యూనిట్‌పై ఎడమవైపు ఆకుపచ్చ రంగు ఎల్‌ఈడీ లైట్‌ వెలుగుతూ ఉంటుంది. ఓటు రిలీజ్‌ చేశాక కుడివైపు ఎరుపు రంగు లైట్‌ వెలుగుతుంది. దీన్ని ఓటరు గమనించవచ్చు.) 

లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు కంట్రోల్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.


ఆ తరువాత బ్యాలెట్‌ యూనిట్‌  వద్దకు ఓటరు వెళ్లాలి. ఈ యూనిట్‌ పైభాగంలో ఆకుపచ్చని ఎల్‌ఈడీ లైట్‌ వెలుగుతూ ఉంటుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై అతికించిన బ్యాలెట్‌ పత్రంపై తాను ఓటేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు పక్కనే ఉన్న మీటను నొక్కాల్సి ఉంటుంది. మీటను నొక్కగానే.. దాని పక్కనే ఉన్న బాణం గుర్తులో ఎరుపు రంగు లైటు వెలుగుతుంది. బీప్‌ శబ్దం వస్తుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై ఉన్న ఆకుపచ్చ రంగు లైటు ఆరిపోతుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై సమీపంలోనే ఉన్న వీవీప్యాట్‌ యంత్రంలో ఒక చీటీ కనిపిస్తుంది. అందులో ఓటరు ఓటు వేసిన పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు కనిపిస్తాయి. ఈ చీటీ ఏడు క్షణాలపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బాలో పడిపోతుంది. దాన్ని పరిశీలించి.. తాను వేసిన ఓటు సరిగ్గా పోలైందా, లేదా అన్నది ఓటరు నిర్ధారించుకోవచ్చు.

 లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు  వేరువేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది.


పోలింగ్‌ సమయం ముగిశాక కంట్రోల్‌ యూనిట్‌పై ఉన్న క్లోజ్‌ అనే మీటను అధికారులు నొక్కుతారు. వెంటనే పడిన ఓట్లు, అభ్యర్థుల సంఖ్య యూనిట్‌పై ఉన్న స్క్రీన్‌లో కనిపిస్తాయి. పోలింగ్‌ క్లోజ్‌ అని కూడా కనిపిస్తుంది. అనంతరం పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల సమక్షంలో ఆ యూనిట్‌కు సీల్‌ వేస్తారు. దాన్ని ఓ బాక్సులో పెట్టి.. దానికీ సీల్‌ వేస్తారు. ఈ సందర్భంగా పోలింగ్‌ అధికారులు, బూత్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఈ కంట్రోల్‌ యూనిట్లను, వీవీ ప్యాట్‌ యంత్రాలను కౌంటింగ్‌ చేపట్టేవరకు భద్రపరుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img