Bommai: అలాంటి చర్చలేం జరగలేదు.. రాజకీయాల్లో భవిష్యత్తును అంచనా వేయడం కష్టం!

Basavaraj Bommai: కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ మధ్య అవగాహనకు చర్చలు జరుగుతున్నట్టు వస్తోన్న ఊహాగానాలపై మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత బసవరాజ్ బొమ్మై స్పందించారు.

Updated : 13 Jun 2023 18:30 IST

హుబ్బళ్లి: లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha polls) సమీపిస్తున్న వేళ జేడీఎస్‌(JDS) భాజపాకు దగ్గరవుతోందని,  ఆ రెండు పార్టీల మధ్య అవగాహనకు చర్చలు జరుగుతున్నట్టు వస్తోన్న వార్తలపై కర్ణాటక మాజీ సీఎం, భాజపా నేత బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) స్పందించారు.  జేడీఎస్‌(JDS)తో ఎన్నికల అవగాహనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించిన బొమ్మై..  రాజకీయాల్లో భవిష్యత్తును అంచనా వేయడం కష్టమన్నారు. కాంగ్రెస్‌ను నిలువరించేందుకు పలు పార్టీలు ఏకమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని విలేకర్లు ఆయన వద్ద ప్రస్తావించగా..  ‘‘అలాంటి చర్చలు జరుగుతున్నట్టు మీడియాలో వస్తున్నాయి. దీనిపై అన్ని ఛానళ్లలో చర్చలు జరుగుతున్నాయి. మేం నిశితంగా గమనిస్తున్నాం’’ అన్నారు.  

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల తర్వాత జేడీఎస్‌ భాజపాతో పొత్తు పెట్టుకొనేందుకు చూస్తోందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇటీవల దిల్లీ పర్యటనలో పలువురు భాజపా సీనియర్‌ నేతలను కలిశారు.  అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో అవగాహనపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్న కుమారస్వామి.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి తమ ముందు లేదంటూ సోమవారం వ్యాఖ్యానించడం గమనార్హం. భాజపా, జేడీఎస్‌ మధ్య పొత్తుకు అవకాశాలపై ఊహాగానాలు, అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేసే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.  2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో భాజపా దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 28 సీట్లకు గాను భాజపా 25స్థానాల్లో సత్తా చాటగా.. జేడీఎస్‌, కాంగ్రెస్‌, స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని