Opposition meet: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడతాం.. ఐక్యతా రాగం వినిపించిన విపక్ష నేతలు

Opposition meet: పట్నా వేదికగా జరిగిన విపక్షాల భేటీ ముగిసింది. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను నేతలు మీడియాకు వెల్లడించారు. 

Updated : 23 Jun 2023 17:32 IST

పట్నా:  2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే లక్ష్యంతో బిహార్‌ రాజధాని పట్నా వేదికగా జరిగిన విపక్షాల భేటీ ముగిసింది. అనంతరం విపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాము కలిసికట్టుగా పోరాడేందుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించినట్లు వెల్లడించారు. తమ మధ్య ఎంతో సానుకూల చర్చ జరిగిందని తెలిపారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం తదుపరి సమావేశం శిమ్లాలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (Opposition Patna meet)

సుమారు 15 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపాయి. ఈ సమావేశానికి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ ఆతిథ్యం ఇచ్చారు. భేటీ అనంతరం చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా  నేతలంతా ఐక్యతారాగం వినిపించారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. దీనికి సంబంధించి స్పష్టత కోసం వచ్చే నెల శిమ్లాలో మరో సమావేశం నిర్వహించనున్నాం. సీట్ల పంపకాలు, పార్టీల వారీగా విభజన వంటి అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’అని నీతీశ్ కుమార్ అన్నారు.

శిమ్లా సమావేశం జులై 10 లేక 12వ తేదీలో ఉండొచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘మేం భాజపాను గద్దె దించేందుకు నిర్ణయించుకున్నాం. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసంతో ఉన్నాం’ అని తెలిపారు. ‘మా మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. మా భావ జాలాన్ని కాపాడుకోవడానికి..ఆ అభిప్రాయభేదాలను పక్కన పెట్టి పోరాడేందుకు నిర్ణయించుకున్నాం. భాజపా దాడులను ఐక్యంగా ఎదుర్కొంటాం’అని రాహుల్ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పట్నాలో మొదలైంది ప్రజా ఉద్యమం అవుతుందని వ్యాఖ్యానించారు. అత్యయిక పరిస్థితి వేళ బిహార్‌లో మొదలైన జేపీ ఉద్యమాన్ని ఉద్దేశించి ఈ మాట అన్నారు. 

ఇదిలా ఉంటే.. భేటీలో భాగంగా మమత.. బెంగాల్‌లో కాంగ్రెస్ వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టారు. ‘ప్రతి ఒక్కరు విశాల హృదయంతో వ్యవహరించాలి. మనమధ్య కుమ్ములాటలు ఉంటే మధ్యలో భాజపా లబ్ధి పొందుతుంది’ అని అన్నట్లు సమాచారం. ఒకవైపు ఈ సమావేశం జరుగుతుంటే.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరీ.. తృణమూల్‌ను దొంగల పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం భేటీ అనంతరం మీడియా సమావేశానికి హాజరుకాకుండానే వెళ్లిపోయారు. సమాయాభావం వల్లే ఆయన వెళ్లాల్సి వచ్చిందని నీతీశ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు