Andhra News: ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారు: జడ్జికి వివరించిన పట్టాభి

తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంట సేపు కొట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్‌.. న్యాయవాది, న్యాయమూర్తికి వివరించారు.

Updated : 21 Feb 2023 20:40 IST

గన్నవరం: తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌కు ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంట సేపు కొట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు పట్టాభితో పాటు 13 మంది తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ గన్నవరం కోర్టులో హాజరుపర్చారు. ‘తోట్లవల్లూరు స్టేషన్‌కు వెళ్లే సరికి అంతా చీకటిగా ఉంది. ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారు. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్‌ చుట్టి కొట్టారు. తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు’’ అని కోర్టులో న్యాయవాది, న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.

గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలు రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు తెదేపా నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని