Pawan Kalyan: రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి: పవన్‌

బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైకాపా కేబినెట్‌లో ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. 

Updated : 10 Apr 2024 20:38 IST

తణుకు: బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైకాపా కేబినెట్‌లో ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. రైతును ఏడిపించిన వైకాపా ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోవాలన్నారు. 

‘‘తణుకులో జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా వెనక్కి తగ్గాం. భాజపా కోసం అనకాపల్లి ఎంపీ సీటును వదులకున్నాం. చంద్రబాబు కూడా తగ్గారు. రాష్ట్ర ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొనే పొత్తు పెట్టుకున్నాం. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు? ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు. మాట్లాడితే జగన్‌ క్లాస్‌ వార్‌ అంటారు. క్లాస్‌ వార్‌ అంటే అర్థం తెలుసా? డబ్బున్న వాళ్లు.. కష్టపడే వారిని దోచుకోవడం. 70వేల పోలీసు కుటుంబాలకు టీఏ, డీఏలు, సరెండర్‌ లీవ్స్‌ ఈరోజు వరకు ఇవ్వలేదు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపీడీ చేసే వ్యక్తి జగన్‌. ఇలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం వస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి.

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలి..

వైకాపా నేతలు దోచుకున్న డబ్బుతో.. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టినా కనీసం యువతకు ఉపాధి దొరికేది. ధాన్యంలో మొలకలు వచ్చాయని రైతు ఏడుస్తుంటే.. ఇక్కడి మంత్రి బూతులు తిట్టారు. ఎంత అహంకారం. జనసైనికుల ఒంటిపై పడిన దెబ్బ ఇంకా మర్చిపోలేదని ఈ మంత్రిని హెచ్చరిస్తున్నా. జగన్‌ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు వస్తాయి. ఐదు కోట్ల మందికి ఒకరిద్దరు సరిపోరు.. 3 పార్టీల బలం కావాలి.  కేంద్రం సహాయ సహకారాలు రాష్ట్రానికి కావాలి. నాలుగు దశాబ్దాలుగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబు. ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. ఆంధ్రప్రదేశ్‌ యువత భవిష్యత్తు బాగుండాలనే కొంత తగ్గాను. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసు’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని