PM Modi: ప్రజల ఆశీర్వాదంతోనే రికార్డు విజయం: ప్రధాని మోదీ

ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం వద్ద  ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ పాల్గొన్నారు.

Updated : 08 Dec 2022 19:59 IST

దిల్లీ: గుజరాత్‌ ప్రజలు భారతీయ జనతా పార్టీ (BJP) వైపే ఉన్నారని ఫలితాలు మరోసారి నిరూపించాయని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే గత రికార్డులు తిరగరాస్తూ భాజపా విజయం సాధించిందని చెప్పారు. గుజరాత్‌ అసెంబ్లీ (Gujarat elections) ఎన్నికల్లో ఘన విజయం తర్వాత దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గుజరాత్‌లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందన్నారు. గుజరాత్‌ ప్రజలు అన్ని రికార్డులూ బ్రేక్‌ చేశారని అభినందించారు. భాజపాకు మద్దతిచ్చి సరికొత్త చరిత్ర రాశారన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో నూ భాజపా సత్తా చాటిందన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందనడానికి ఫలితాలే నిదర్శమని పేర్కొన్నారు.

‘‘యూపీ రాంపూర్‌లో భాజపా విజయం సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపోటములు జరిగాయి. ఇంత తక్కువ ఓట్ల శాతంతో గెలుపోటములు గతంలో ఎప్పుడూ జరగలేదు. హిమాచల్‌ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. బిహార్‌ ఉప ఎన్నికల్లో భాజపా అద్భుత ప్రదర్శన చేసింది. ఆ రాష్ట్రంలో మున్ముందు భాజపా విజయ సంకేతానికి చిహ్నం. ఒక్క పోలింగ్‌ కేంద్రంలోనూ రీపోలింగ్‌ జరపాల్సిన అవసరం రాకుండా ఎన్నికల సంఘం సమర్థంగా తన విధులు నిర్వర్తించింది. ఎన్నికల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకూ  అభినందనలు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బాగా పోరాటం చేశాం. దిల్లీ నగరపాలిక ఎన్నికల్లో ప్రజలను వంచించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేం’’ అని మోదీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని