Rahul Gandhi: స్పీకర్‌జీ..వివరణ ఇచ్చేందుకు అనుమతివ్వండి: రాహుల్‌

తనపై వస్తున్న ఆరోపణలపై లోక్‌సభ (Loksabha)లో వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla)కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు.

Published : 22 Mar 2023 00:10 IST

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament) ఇంటాబయటా అధికార భాజపా (BJP) తనపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. లండన్‌ (London)లో తాను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ (Loksabha)లో వివరణ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాకు మరోసారి లేఖ రాశారు. భాజపా సీనియర్‌ మంత్రులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న రాహుల్‌గాంధీ. తమపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు గతంలో కేంద్ర మంత్రులకు ఇచ్చినట్లుగా అవకాశం ఇవ్వాలని కోరారు. అదే నియమాన్ని తనకు కూడా వర్తింప చేయాలని కోరారు. పార్లమెంట్‌ నిబంధనలకు అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన సహజ న్యాయసూత్రాల ఆధారంగానే అనుమతి కోరుతున్నానని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్‌ 357 ప్రకారం అనుమతివ్వాల్సిందిగా స్పీకర్‌ను అభ్యర్థించారు.

ఈ నిబంధన ప్రకారం పార్లమెంట్‌ సభ్యులెవరిమీదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, సంబంధిత సభ్యుడు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకునేందుకు స్పీకర్‌ అనుమతి ఇవ్వొచ్చు. అయితే, అది కేవలం వివరణలాగే ఉండాలి తప్ప.. ఆ అంశంపై చర్చ జరపడానికి వీల్లేదు. పార్లమెంట్‌లోనే కాకుండా.. బయట కూడా కొందరు అధికార పార్టీ నేతలకు తన మాటలను వక్రీకరించి చెబుతున్నారని, అందువల్ల వాటిపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం అనుమతివ్వాలని రాహుల్‌ గాంధీ తన లేఖలో కోరారు. పార్లమెంట్‌లో జ్యోతిరాదిత్య సింధియా తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలోనూ ఇదే నిబంధన వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

ప్రధాన పక్షం, ప్రతిపక్షం అనే భేదభావం లేకుండా పార్లమెంట్‌ అందరి సభ్యులకు సమాన హక్కులు కల్పించిందని, ఇతర సంస్థలలాగే పార్లమెంట్‌ కూడా సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాహల్‌ వ్యాఖ్యానించారు. రెండో విడత పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైననాటి నుంచి ఉభయసభల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. చర్చోపచర్చలు లేకుండా సభలు వాయిదా పడుతున్నాయి. రాహుల్‌ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్‌ చేస్తుండగా.. అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ వివాదాల నడుమనే గత ఏడు రోజులుగా సభలు వాయిదా పడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని