Annamalai: ₹500 కోట్లకు డీఎంకే నోటీసులు.. చట్టపరమైన చర్యలకు సిద్ధమేనన్న అన్నామలై

తమిళనాడు సీఎం స్టాలిన్‌పై చేసిన నిరాధార ఆరోపణలకు గాను బహిరంగ క్షమాపణతో పాటు రూ.500 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ డీఎంకే ఇచ్చిన లీగల్‌ నోటీసులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు.

Published : 17 Apr 2023 16:22 IST

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin)పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్‌ అన్నామలై క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కింద రూ.500 కోట్లు  చెల్లించాలంటూ అధికార పార్టీ లీగల్‌ నోటీసులు పంపడంపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలకు తాను సిద్ధంగానే ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో అన్నామలై ఓ ప్రకటన విడుదల చేశారు.  అలాగే, తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను అధికార పార్టీ కూడా తనకు అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు.  గతంలో డీఎంకే హయాంలో జరిగిన మెట్రో రైలు ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. వీటిని సీబీఐకి అప్పగిస్తామని అన్నామలై పేర్కొన్నారు. 

తనకు లీగల్‌ నోటీసులు పంపిన డీఎంకే సంస్థాగత కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ఎస్‌ భారతిపై అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు, ఆ ప్రాజెక్టులో జోక్యం ఉన్నవారికి సీబీఐ నోటీసులు ఇచ్చేంతవరకు ఓపికతో వేచి చూడాలంటూ ఆర్‌ఎస్‌ భారతికి సూచించారు. మరోవైపు,  ‘డీఎంకే ఫైల్స్‌’ పేరుతో విడుదల చేసిన 15 నిమిషాల వీడియోలో భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) అసంబద్ధ ఆరోపణలు చేశారని, డీఎంకే నేతల ఆస్తులను పెంచేసి చూపించారంటూ  నిన్న డీఎంకే ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.  ఇందుకుగానూ అన్నామలై వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడంతోపాటు తమ పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా రూ.500 కోట్లను చెల్లించాలంటూ ఆర్‌ఎస్‌ భారతి తన నోటీసుల్లో పేర్కొన్నారు.  డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తన 56 ఏళ్ల ప్రజా జీవితంలో అక్రమంగా ఒక్క పైసా కూడా ఏ ఒక్కరి నుంచి తీసుకోలేదన్నారు. అందువల్ల నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ నోటీసులు అందిన 48 గంటల్లో అన్నామలై బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.500 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. డీఎంకే ఆరోపణలపై అన్నామలై ఎదురుదాడికి దిగారు. అరుంధతి ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.84 కోట్లు తీసుకున్నట్టుగా ఆర్‌ఎస్‌ భారతి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా, భాజపా పైన ఆరోపణలు చేసినందుకు రూ.501 కోట్లు చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఆ మొత్తాన్ని తాను పీఎం కేర్స్‌ నిధికి జమ చేస్తానని చెప్పారు. తనపైనా, భాజపా పైనా ఆర్‌ఎస్‌ భారతి చేసిన ఆరోపణలకు తగిన వివరణ ఇవ్వకపోతే 48 గంటల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని