బాబాయిని చంపిన వాళ్లనే శిక్షించలేని నువ్వేం నాయకుడివి?: జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న

తన బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి హత్య చేసి ఐదేళ్లయినా నిందితులకు శిక్ష పడలేదంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా?

Updated : 05 Apr 2024 20:37 IST

కలసపాడు, బద్వేల్‌: తన బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి హత్య చేసి ఐదేళ్లయినా నిందితులకు శిక్ష పడలేదంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా?అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. వివేకా హత్య విషయంలో సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. ఈ కేసులో నిందితులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం బద్వేల్‌లో నిర్వహించిన బస్సు యాత్రలో షర్మిల మాట్లాడారు. ‘‘బాబాయిని చంపిన వారిని శిక్షించలేని నువ్వు నాయకుడివి ఎలా అవుతావు? అవినాశ్‌ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావ్‌? హత్య చేసిన వాళ్లకే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. ఈ ఘోరాన్ని ఆపడానికే వైఎస్‌ఆర్‌ బిడ్డ ఎంపీగా నిలబడింది. ఇది న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటం. ఇందులో గెలుపు ఎవరిదో యావత్‌ ప్రపంచం చూస్తుంది. గెలిపిస్తే అందుబాటులో ఉంటా.. పిలిస్తే పలుకుతా. మీ సమస్యలను నేను భుజాన వేసుకుంటా. వైఎస్‌ఆర్‌ మాదిరి సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి’’ అని ప్రజలను కోరారు.

షర్మిలను చూస్తే జగనన్నకు భయం పట్టుకుంది: సునీత

‘‘నా తండ్రి వివేకాను కిరాతకంగా హత్య చేశారు. హత్య చేయించింది ఎంపీ అవినాశ్‌ రెడ్డి. ఇప్పుడా వ్యక్తి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. జగన్‌ జైలులో ఉన్నప్పడు షర్మిల వైకాపాను బతికించింది. జైలు నుంచి వచ్చాక జగన్‌ ఆమెను పక్కనబెట్టాడు. జగన్‌కు షర్మిలను చూస్తే భయం పట్టుకుంది. జగన్‌ కంటే రాజకీయంలో షర్మిల ముందున్నారు. వైఎస్‌ఆర్‌లో ఉన్న ప్రతీ లక్షణం షర్మిలలో ఉంది. జగనన్న హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. వివేకా హంతకులను కాపాడుతున్నారు. హంతకులకు శిక్ష పడాలి. శిక్ష పడాలంటే హంతకులకు అధికారం ఉండొద్దు. గద్దె దించే సమయం వచ్చింది. అవినాశ్‌ రెడ్డిని ఓడించాలి.. షర్మిలను గెలిపించాలి’’ అని  ప్రజలకు సునీత విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని