Sanjay Raut: ఠాక్రేకు వెన్నుపోటు.. ఇదిగో ఇలాగే..!

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Published : 30 Jun 2022 11:50 IST

చిత్రం షేర్ చేసి.. మండిపడ్డ సంజయ్ రౌత్‌

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో తదుపరి కార్యాచరణపై భాజపా, అసమ్మతి ఎమ్మెల్యేలు చకచకా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలపై స్పందించిన శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut).. ప్రభుత్వం కూలడానికి కారణమైన తిరుగుబాటు నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.

‘నిన్న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసినప్పుడు మేమంతా ఉద్వేగానికి గురయ్యాం. ప్రతి ఒక్కరికీ ఆయనపై విశ్వాసం ఉంది. ప్రతివర్గం మద్దతు ఉంది. సోనియా గాంధీ, శరద్ పవార్‌ ఆయనపై నమ్మకం ఉంచారు. శివసేన అధికారం కోసం పుట్టలేదు. అధికారమే శివసేన కోసం పుట్టింది. ఇదే ఎల్లప్పుడూ బాలా సాహెబ్ చెప్పే మంత్రం. ఇక్కడితో మా పోరాటాన్ని ఆపబోం. మరోసారి మా సొంతంగా అధికారాన్ని చేపట్టేందుకు కృషి చేస్తాం’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అసమ్మతి ఎమ్మెల్యేలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వారు శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారంటూ ఓ చిత్రం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరిగింది’ అంటూ మండిపడ్డారు. 

రేపు ఈడీ ముందు హాజరవుతా..

ఈ రాజకీయ సంక్షోభ సమయంలోనే సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూ కుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు సమన్లు జారీ చేసినట్టు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.. జులై 1వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. ఈ సమన్లపై ఆయన స్పందిస్తూ.. ‘నేను రేపు ఈడీ కార్యాలయానికి వెళ్తున్నాను’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని