Sibal on Modi: కేసీఆర్‌వి వారసత్వ రాజకీయాలైతే.. మరి మీవేంటి?: సిబల్‌

Sibal on Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలపై సిబల్‌ మండిపడ్డారు.

Published : 09 Apr 2023 12:43 IST

దిల్లీ: అధికార భాజపా ‘అనుకూల రాజకీయాల’కు పాల్పడుతోందని రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) శనివారం తెలంగాణలో చేసిన వ్యాఖ్యలపై సిబల్‌ మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలు చేస్తున్న పార్టీలతో గతంలో భాజపా చేతులు కలపలేదా? అని ప్రశ్నించారు.

కుటుంబపాలనే అవినీతికి మూలమని తెలంగాణలో పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో నరేంద్రమోదీ (Modi) అన్నారు. కుటుంబపాలన, అవినీతి కలిసే ఉంటాయని.. ఆ రెండింటితో మమేకమైన వ్యక్తులు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని.. పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ పరోక్షంగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తాజాగా సిబల్‌ ట్విటర్‌ వేదికగా భాజపాకు పలు ప్రశ్నలు సంధించారు.

‘‘కేసీఆర్‌ను ప్రధాని విమర్శిస్తూ.. అవినీతి, కుటుంబపాలన కలిసే ఉంటాయన్నారు. పంజాబ్‌లో అకాలీలు, ఆంధ్రలో జగన్‌, హరియాణాలో చౌతాలాలు, జమ్మూకశ్మీర్‌లో ముఫ్తీలు, మహారాష్ట్రలో ఠాక్రేలతో భాజపా కలిసినప్పుడు వారివి వారసత్వ రాజకీయాలు కాదా? దీన్నే అనుకూల రాజకీయాలు అంటారు’’ అని సిబల్‌ విమర్శించారు. అదే సమయంలో ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’పై కూడా భాజపా అవినీతి ఆరోపణలు చేస్తోంది కదా అని గుర్తుచేశారు. కానీ, అక్కడ వారసత్వ రాజకీయాలు లేవని పేర్కొన్నారు. అలాంటప్పుడు అవినీతి ఆరోపణలు చేయడానికి వారసత్వ రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదని సిబల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని