Sonia Gandhi: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ బరిలో సోనియా!

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి రాజస్థాన్‌ నుంచి నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది.

Updated : 13 Feb 2024 22:48 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధమైంది! రాజస్థాన్‌ నుంచి ఆమె ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం జైపుర్‌ వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమె వెంట కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రియాంకా గాంధీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం చివరిసారి అని సోనియాగాంధీ 2019లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్‌ నుంచి ఆమె పెద్దల సభకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలో 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నప్పటికీ కాంగ్రెస్‌ ఇంతవరకు ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు. నామినేషన్ల గడువు ఈ నెల 15న ముగుస్తుండటంతో ఆ ప్రక్రియను షురూ చేయనుంది. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ లేదా ఆమేఠీ నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు