Odisha: ఒడిశాలో స్పీకర్‌, ఇద్దరు మంత్రులు రాజీనామా.. కారణం ఇదేనా?

Odisha: ఒడిశాలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో స్పీకర్‌, ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

Published : 12 May 2023 23:07 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలో సీఎం నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. స్పీకర్‌ బిక్రమ్‌ కేసరి అరుఖా తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఇద్దరు మంత్రులు సైతం తమ పదవులకు రాజీనామా చేయడం శుక్రవారం చర్చనీయాంశంగా రేపింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌దాస్, కార్మిక శాఖ మంత్రి శ్రీకాంత్ సాహు తమ పదవులకు రాజీనామా పత్రాలను సమర్పించారు.  

స్పీకర్‌ పదవికి రాజీనామా అనంతరం అరుఖా భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు పంపినట్టు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు  స్పష్టంచేశారు. తనకు పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను ఎప్పుడూ నిర్వర్తిస్తూనే వచ్చానన్నారు. భవిష్యత్తులోనే అలాగే కొనసాగగిస్తానని చెప్పారు. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. అయితే, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సూచనగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు సమాచారం.

అరూఖా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జిల్లా గంజాంలోని భంజానగర్‌ సీటు నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పట్నాయక్‌ కేబినెట్‌లో 2009 నుంచి 2022 వరకు పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. గతేడాది స్పీకర్‌ ఎస్‌ఎన్‌ పాత్రో ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను స్వీకరించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అరూఖాకు ప్రభుత్వంలో లేదా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని