MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.

Updated : 23 Mar 2023 20:29 IST

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) అధికార వైకాపాకి గట్టి షాక్‌ తగిలింది. తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha) 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెదేపా మరోసారి తన సత్తా చాటినట్లయింది. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా..  శాసనసభలో తనకున్న బలాన్నిబట్టి తెదేపా ఒక అభ్యర్థిని మాత్రమే పోటీకి నిలబెట్టింది.

మొత్తం 7 స్థానాలకు 8 మంది పోటీపడిన వేళ గెలుపెవరిది? అనే అంశం ఆసక్తి రేకెత్తించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్‌ తిన్న వైకాపా.. ఏడుకు ఏడు స్థానాలు కైవసం చేసుకోవాలని పంతం పట్టింది. ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా జాగ్రత్త పడింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఉత్కంఠ మధ్య పోలింగ్‌ జరగ్గా తెదేపా గెలిచింది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీలను కోల్పోయిన వైకాపాకు ఇది మరో గట్టిషాక్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఐదుగురు వైకాపా అభ్యర్థులు, ఒక తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థుల్లో సూర్యనారాయణ రాజు, పోతుల సునీత, బొమ్మి ఇశ్రాయేలు, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్‌ విజయం సాధించారు.  ఏడో స్థానం కోసం కోలా గురువులు, జయమంగళ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఈ ఇద్దరి మధ్య రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో జయమంగళ విజయం సాధించారు.

ఫలించిన తెదేపా వ్యూహం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా వ్యూహం ఫలించింది. అభ్యర్థిని బరిలోకి దించి అధికార పార్టీ ఏకగ్రీవ ఆశలకు గండికొట్టి.. అభ్యర్థిని గెలిపించుకుంది. మొత్తం 7 స్థానాలకు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... అదే ఉత్సాహంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా దృష్టి పెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, తెదేపా టికెట్‌పై గెలిచి, ఆ తర్వాత వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్‌ జారీ చేసింది. ఓటు వేయడంలో ఎక్కడా పొరపాటు జరగకుండా ఇప్పటికే రెండు, మూడు దఫాలు నమూనా పోలింగ్‌ నిర్వహించింది. తెదేపా అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు.

ఎవరు ఆ నలుగురు?

తెదేపా అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. తెదేపా బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో... కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం శాసనసభలో తెదేపా బలం 19కి తగ్గింది. ఆ నలుగురూ సాంకేతికంగా తెదేపా సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా తెదేపా విప్‌ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ, వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేల నుంచి గానీ.. ముగ్గురు తెదేపా అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుందని భావించింది. అయితే, చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించి, అధికార వైకాపాకు షాక్‌ ఇచ్చారు. అయితే ఆమెకు అనుకూలంగా ఓటు వేసిన ఆనలుగురు ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని