Chandrababu: పోలవరానికి జగనే శని.. అహంకారంతో ప్రాజెక్టును నాశనం చేశారు: చంద్రబాబు

పోలవరం పూర్తయితే తెలుగు తల్లి ఆనందపడేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. స్వర్ణచతుర్భుజి స్ఫూర్తితో నదుల అనుసంధానం చేయాలని గతంలో వాజ్‌పేయీకి  సూచించాను అని చెప్పారు.

Updated : 28 Jul 2023 15:48 IST

మంగళగిరి: పోలవరం పూర్తయితే తెలుగు తల్లి ఆనందపడేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. స్వర్ణచతుర్భుజి స్ఫూర్తితో నదుల అనుసంధానం చేయాలని గతంలో వాజ్‌పేయీకి  సూచించానని చెప్పారు. ‘పోలవరానికి జగనే శని’ అంశంపై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం రోజే పోలవరం పనులను నిలిపేసిన ఘనత జగన్‌దని విమర్శించారు. 

‘‘పోలవరానికి జగనే శని. శని పోతే తప్ప ప్రాజెక్టు కల సాకారం కాదు. అహంకారంతో పోలవరంను నాశనం చేశారు. ఇది పూర్తయితే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లివ్వొచ్చు. 15 నెలలపాటు పోలవరం వద్ద నిర్మాణ సంస్థే లేకుండా చేశారు. కాంట్రాక్టర్‌ను మార్చొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చెప్పినా జగన్‌ వినలేదు. మా హయాంలో పోలవరానికి రూ.11,537 కోట్లు ఖర్చుపెట్టాం. జగన్‌ కేవలం రూ.4,611 కోట్లతో సరిపెట్టారు. నాడు పోలవరం పర్యాటక ప్రాంతంగా ఉండేది. నేడు నిషేధిత ప్రాంతంగా చేశారు.

ఎందుకెళ్లకూడదు.. అదేమన్నా పాకిస్థానా?

డయాఫ్రం వాల్‌ దెబ్బతింటే మమ్మల్ని విమర్శిస్తారా? వరదల వల్లే దెబ్బతిందని నిపుణుల కమిటీనే తేల్చింది. ప్రాజెక్టును చూడటానికి ఎందుకెళ్లకూడదు? అదేమైనా పాకిస్థానా? గైడ్‌ బండ్‌ కూడా కుంగడంతో పోలవరంలో ఇంకేం మిగిలింది? ఇన్ని తప్పిదాలు జరిగితే.. ఆంబోతు రంకెలేస్తారా? నిర్వాసితులకు ఎకరాకు రూ.19లక్షలు ఇస్తామన్న హామీ మరిచారు. పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితా మార్చి మోసం చేశారు. పేదల పొట్ట కొట్టి జగన్‌ తన పొట్ట పెంచుకుంటున్నారు. పేదలను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని