
AP News: కొడాలి నానికి బేడీలు తప్పవు: వర్ల రామయ్య
అమరావతి: గుడివాడలో క్యాసినో నిర్వహించారనే అంశంలో రూపొందించిన సమగ్ర నివేదికను తెదేపా నిజనిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేసింది. ఉండవల్లిలోని ఆయన నివాసంలో కమిటీ సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలో వెళ్లి నివేదికను అందించారు. క్యాసినో అంశం.. నివేదికలో పొందుపరిచిన విషయాలపై చంద్రబాబుతో కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ సమయమిస్తే గుడివాడలో క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తామని వర్ల రామయ్య చెప్పారు. ఈ అంశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఐటీ విభాగాలు రంగంలోకి దిగి నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాల్ని కప్పిపుచ్చుకునేందుకే మంత్రి కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని.. ఆయనకు బేడీలు తప్పవని వర్ల వ్యాఖ్యానించారు. క్యాసినో అంశాన్ని ఇంతటితో వదలబోమని.. జాతీయ స్థాయిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.