
Politics: కాంగ్రెస్ 300 సీట్లలో గెలవడం కష్టమే..: గులాంనబీ ఆజాద్
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై హామీ ఇవ్వలేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత
జమ్మూ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (2024) కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. 300లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇక్కడి భూమిని, ఉద్యోగాలను కాపాడుకోవడమే తమకు ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.
‘ఆర్టికల్ 370 అంశంపై పార్లమెంటులో ఎన్నో ఏళ్లనుంచి తానొక్కడినే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ప్రజలను మభ్యపెట్టి ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఎదోఒక హామీ ఇవ్వలేను’ అని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని సుప్రీంకోర్టు మాత్రమే తేలుస్తుందన్న ఆయన.. కోర్టుతోపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రమే దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోగలదన్నారు. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వమే దాన్ని రద్దు చేసినందున వారు వెనక్కివెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని మాపార్టీ అధికారంలోకి వచ్చాక ఆపని చేస్తామని హామీ ఇవ్వడానికి, అలాంటి అవకాశాలు కనిపించడంలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లలో విజయం సాధించాలనే నేను కోరుకుంటున్నా. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇక జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పక్షాలు ఏకం కావాలని అక్కడి పార్టీలకు ఆజాద్ సూచించారు.
ఇదిలాఉంటే, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని వ్యతిరేకిస్తోన్న అక్కడి విపక్ష పార్టీలు.. తాము అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామనే అనధికారిక హామీలు ఇస్తున్నాయి. అయితే, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.