
Amaravati news: మరో చెల్లెమ్మకు ఇలాంటి పరిస్థితి రాకూడదు: లోకేశ్
అమరావతి: గుంటూరులో ఇవాళ ఉదయం దారుణహత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య తండ్రి, చెల్లితో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరో చెల్లెమ్మకు ఇలాంటి పరిస్థితి రాకుండా పోరాడతామన్నారు. దిశ చట్టం అంటూ జగన్ బిగ్గరగా అరవడం, వైకాపా బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం జరిగింది లేదని లోకేశ్ ధ్వజమెత్తారు. సోదరికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈరోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం సీఎం చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్.. దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలో గుంటూరులో ఎస్సీ యువతి రమ్యని అత్యంత కిరాతకంగా మృగాడు హత్య చేశాడని దుయ్యబట్టారు. రమ్యని హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని లోకేశ్ డిమాండ్ చేశారు.