ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వండి: పీయూష్‌ గోయల్‌తో రాష్ట్రమంత్రులు

ధాన్యం, ఉప్పుడు బియ్యం సేకరణ అంశంపై చర్చించేందుకు రాష్ట్రమంత్రులు, తెరాస ఎంపీల బృదం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైంది.

Updated : 21 Dec 2021 17:57 IST

దిల్లీ: ధాన్యం, ఉప్పుడు బియ్యం సేకరణ అంశంపై చర్చించేందుకు రాష్ట్రమంత్రులు, తెరాస ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైంది. దిల్లీలోని మంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. వానాకాలం ధాన్యం మొత్తం కొనాలన్న మంత్రులు .. యాసంగి ధాన్యం కొనుగోలుపైనా స్పష్టత కోరారు. సేకరించే ధాన్యానికి సంబంధించి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కేంద్రమంత్రిని అడిగారు. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని కేంద్రమంత్రి చెప్పినట్టు సమాచారం. తెలంగాణ నుంచి సేకరించే బియ్యంపైనా స్పష్టత కోరినట్టు తెలిసింది. సేకరించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ త్వరగా తరలించడంలేదన్న మంత్రులు.. ధాన్యం సొమ్ము కూడా సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

స్పష్టత ఇచ్చిన తర్వాతే దిల్లీ నుంచి కదులుతాం: నిరంజన్‌రెడ్డి

కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రులు, ఎంపీలు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.... ‘‘బియ్యాన్ని ఎఫ్‌సీఐ తరలించడం లేదనే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే స్పందించిన పీయూష్ గోయల్‌ .. రైల్వే మంత్రికి ఫోన్‌ చేసి ర్యాక్‌లు సమకూర్చాలని కోరారు. నెలకు 40లక్షల టన్నుల బియ్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం రాష్ట్రంలో ఉంది. ధాన్యం సేకరణపై భాజపా నేతలు రాష్ట్రంలో చెబుతున్న అంశాలను పీయూష్‌ గోయల్‌కు వివరించాం. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రమంత్రి మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం లక్ష్యం 60లక్షల టన్నుల ధాన్యం సేకరణ 2...3 రోజుల్లో పూర్తవుతుంది. మార్కెట్‌ యార్డుల వద్ద మరో 10... 12లక్షల  టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. మరో 5లక్షల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఈనేపథ్యంలో మిగతా ధాన్యం సేకరించాలా?వద్దా? అని స్పష్టత కోరాం. కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలా? మూసివేయాలా? చెప్పాలని కోరాం. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ కోరాం. ఏ విషయమూ చెప్పేందుకు పీయూష్‌ గోయల్‌ రెండ్రోజుల సమయం కోరారు. స్పష్టంగా చెప్పిన తర్వాతే దిల్లీ నుంచి కదులుతాం’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని