UP Election 2022: ఆ అభ్యర్థి చెంత రూ.6,700 ఉన్నాయట..!

ఉత్తర్‌ప్రదేశ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో మొదట విడత పోలింగ్ ముగించుకొని, రెండో దశ ఓటింగ్‌(ఈ నెల 14న)కు సిద్ధమవుతోంది.

Published : 12 Feb 2022 02:06 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల మొదట విడత పోలింగ్‌ ముగిసింది. రెండో దశ ఓటింగ్‌ ఈ నెల 14న జరగనుంది. ఈ దశలో అత్యంత ధనిక అభ్యర్థి ఆస్తుల విలువ రూ.269 కోట్లు ఉండగా.. పేద అభ్యర్థి చెంత కేవలం రూ.6,700 మాత్రమే ఉన్నాయట. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఈ దశలో పోటీ పడుతున్న 586 మంది అభ్యర్థుల్లో 584 మంది అఫిడవిట్లను పరిశీలించి ఈ వివరాలను వెల్లడించింది.

రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి నవాబ్ కాజిమ్ అలీ ఖాన్ తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువను రూ.296 కోట్లుగా పేర్కొన్నారు. ఆయన తర్వాత సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సుప్రియా అరోన్‌ పేర్కొన్న ఆస్తుల మొత్తం రూ.157 కోట్లు. భాజపా అభ్యర్థి దేవేంద్ర నాగ్‌పాల్ వద్ద రూ.140 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 

షాజహాన్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజయ్ కుమార్‌ ఆస్తుల విలువ కేవలం రూ.6,700 మాత్రమేనట. స్థిరాస్తులు ఏమీ లేవని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ నుంచి పోటీ చేస్తున్న విశాల్‌ వద్ద రూ.13,500, మాలిక్ వద్ద రూ.15,000 ఉన్నాయని తమ తమ అఫిడవిట్లలో పేర్కొన్నట్లు ఏడీఎర్‌ వెల్లడించింది. రెండో విడతలో బరిలో ఉన్న 584 మందిలో 45 శాతం (260 మంది) మంది కోటీశ్వరులే. కోటికి పైగా ఆస్తుల విలువను ప్రకటించి వారిలో భాజపా నేతలే అత్యధికం. ఆ విషయంలో ఆప్‌ అట్టడుగున ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని