Bengal Rural Polls: పంచాయతీ ఎన్నికల్లో దీదీ జోరు.. 34వేల స్థానాల్లో టీఎంసీ గెలుపు

Bengal rural polls: పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ సత్తా చాటింది. భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అటు ప్రధాన ప్రత్యర్థి టీఎంసీకి భాజపా దరిదాపుల్లో కూడా రాలేకపోయింది.

Updated : 12 Jul 2023 13:00 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Rural Polls) అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 63వేల పంచాయతీల్లో టీఎంసీ ఏకంగా 34,560 పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. మరో 705 చోట్ల ఆధిక్యంలో ఉంది. తన ప్రధాన ప్రత్యర్థి భాజపా (BJP) 9,621 స్థానాల్లో గెలిచి.. మరో 169 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. సీపీఎం 2,908 చోట్ల గెలిచి 86 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ (Congress) 2,515 స్థానాలను దక్కించుకుని 71 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉన్న బెంగాల్లో మొత్తం 73,887 స్థానాలకు శనివారం ఎన్నికలు (Panchayat Elections) జరిగాయి. ఇందులో గ్రామ పంచాయతీలు 63,229 ఉన్నాయి. మిగిలిన వాటిలో 9,730 పంచాయతీ సమితులు, 928 జిల్లా పరిషత్తు సీట్లు ఉన్నాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలవ్వగా.. రేపు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక, పంచాయతీ సమితుల్లో టీఎంసీ ఇప్పటికే 6,228 స్థానాలను దక్కించుకోగా.. మరో 218 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 960 సమితిల్లో గెలిచి.. మరో 50 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 928 జిల్లా పరిషత్తు సీట్లలో తృణమూల్‌ 592 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 188 చోట్ల ఆధిక్యంలో ఉంది. భాజపా కేవలం 18 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. మరో 9 చోట్ల ముందంజలో ఉంది.

మరో ముగ్గురి మృతి..

మరోవైపు, కౌంటింగ్‌ సమయంలోనూ బెంగాల్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా.. ఓ పోలీసు అధికారి గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

బెంగాల్‌లో గత శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పెద్ద ఎత్తున హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్‌ను నిలిపివేశారు. అలా 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్‌ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని