Uday Samant: విపక్షాల భేటీ.. ప్రయోజనమేంటి?: ఉదయ్‌ సామంత్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశంలో శివసేన (యూబీటీ)నేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) పాల్గొనడంపై మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ విమర్శలు గుప్పించారు. ఈ భేటీతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు.

Published : 24 Jun 2023 19:33 IST

ముంబయి: తాజా పరిస్థితులను చూస్తుంటే శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) తన భావజాలంతో రాజీపడి ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించిన వారి పక్కనే కూర్చున్నారని మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ (Uday Samant) విమర్శించారు. ఒకరోజు ప్రధానిని చేస్తే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తానన్నది ‘బాలాసాహెబ్‌ ఠాక్రే’ కలని ఆయన అన్నారు. నీతీశ్‌ కుమార్‌ అధికారిక నివాసంలో జరిగిన సమావేశంతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. వారి భవిష్యత్తు కోసమే నాయకులంతా అక్కడ సమావేశమయ్యారు తప్ప.. ప్రజల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సామంత్‌ మాట్లాడుతూ.. నీతీశ్‌ కుమార్‌ను భారత ప్రధానిని చేస్తామంటే మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీనే (modi) ప్రధానిమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నీతీశ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ) హాజరవ్వడాన్ని ఉటంకిస్తూ.. తమ ఉనికిని కాపాడుకునేందుకే ఎంవీఏ పాల్గొందని ఎద్దేవా చేశారు. ఠాక్రే వర్గానికి, ఎన్సీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని, వారి కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సొంత పార్టీలోనే గౌరవం లేదన్నారు. భాజపాను గద్దె దించుతామంటూ విపక్ష పార్టీలన్నీ సమావేశమైనా.. ప్రధాని అభ్యర్థిని మాత్రం ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. భాజపా మద్దతుతో గెలిచిన వ్యక్తి ఇప్పుడు అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో నీతీశ్‌కుమార్‌ భాజపాకు మద్దతివ్వరని గ్యారెంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలంతా నాయకుల నిజ స్వరూపాన్ని చూస్తున్నారని, దాన్ని బట్టే ఎన్నికల్లో వారి స్థానమేంటో నిర్ణయిస్తారని సామంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని