Gannavaram: వైకాపాకు గుడ్‌బై.. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోనే జగన్‌ను కలుస్తా: యార్లగడ్డ వెంకట్రావు

వైకాపాను వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. తెదేపాలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్‌ కోరుతున్నానని చెప్పారు.

Updated : 18 Aug 2023 15:16 IST

గన్నవరం: వైకాపాను వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. తెదేపాలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోరుతున్నానని చెప్పారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టికెట్‌ ఇవ్వాలని కోరారు. విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. ‘‘రానున్న ఎన్నికల్లో గన్నవరం తెదేపా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తా. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘2005లోనే అమెరికా గ్రీన్ కార్డు వచ్చినా రాజకీయాలపై ఇష్టంతో గన్నవరం తిరిగి వచ్చా. పాదయాత్రలో ఇంటింటికీ తిరిగాను. గన్నవరంలో ఎవరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. నేను గన్నవరం నుంచి ఓడినా కార్యకర్తలు నాతోనే ఉన్నారు. నాతో పని చేసినవారికి పదవులు ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం పార్టీ పెద్దలను కలిసి టికెట్ అడిగా. అది వారికి సరిగ్గా అర్థం కాలేదు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో తిరిగితే.. ఉండాలనుకుంటే ఉండు లేకపోతే వెళ్లిపో అన్నట్టుగా సజ్జల మాట్లాడారు. తెదేపాకు కంచుకోట లాంటి గన్నవరంలో వైకాపా కోసం కష్టపడి పని చేశా. వైకాపా కోసం పని చేసినందుకు ఇలాంటి దుస్థితి వస్తుందని ఊహించలేదు.

బలాబలాలను బట్టి టికెట్ వస్తుందని వైకాపాలో కొందరు మాట్లాడటం చూస్తే విచిత్రంగా అనిపిస్తోంది. 2018లో సరిపోయిన నా బలం ఇప్పుడు సరిపోదా?తడిగుడ్డతో గొంతు కోయడం నా విషయంలో రుజువైంది. ఇప్పటివరకు తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, దేవినేనిని నేను కలవలేదు. వారితో భేటీ అయ్యానని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పాయా?నాకు అపాయింట్‌మెంట్‌ లేదా టికెట్ ఇవ్వని సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని యార్లగడ్డ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని