అత్యధిక చర్చ ఉక్రెయిన్‌ సంక్షోభంపైనే

ప్రతిఒక్కరికీ విజయం చేకూరే తరహా పరిస్థితులను ప్రపంచంలో మళ్లీ సృష్టించాలని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బోర్గె బ్రెండె పిలుపునిచ్చారు. కేవలం కొందరికే ప్రయోజనం కలిగే పరిస్థితులు నెలకొనడం సరికాదని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా

Updated : 27 May 2022 06:39 IST

ముగిసిన దావోస్‌ సదస్సు

దావోస్‌: ప్రతిఒక్కరికీ విజయం చేకూరే తరహా పరిస్థితులను ప్రపంచంలో మళ్లీ సృష్టించాలని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బోర్గె బ్రెండె పిలుపునిచ్చారు. కేవలం కొందరికే ప్రయోజనం కలిగే పరిస్థితులు నెలకొనడం సరికాదని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా గురువారం ఆయన ప్రసంగించారు. ప్రపంచం నలుమూలల నుంచి పలు రంగాలకు చెందిన 2,500 మంది ప్రముఖులు ఈ ఏడాది సదస్సులో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇంధన సంక్షోభం, ఆహార కొరత, పర్యావరణ మార్పుల వంటి పలు అంశాలపై వారు చర్చించారు. సదస్సులో భాగంగా ఈ దఫా దాదాపు 450 చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం అత్యధిక చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది.

భారత్‌ నుంచి పలువురు కీలక వ్యక్తులు దావోస్‌ సదస్సులో పాల్గొన్నారు. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌సింగ్‌ పురి, మన్సుఖ్‌ మాండవీయ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తదితరులు ఉన్నారు. మన దేశం నుంచి దాదాపు 100 మంది వ్యాపారవేత్తలూ హాజరయ్యారు.

రష్యా కార్యకలాపాలను ముందే గుర్తించాం: సత్య నాదెళ్ల

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ ప్రయత్నాలను యుద్ధం ప్రారంభానికి చాలా ముందుగానే అధునాతన సైబర్‌ సామర్థ్యాలతో తాము గుర్తించామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. దానివల్ల ఉక్రెయిన్‌ ప్రభుత్వం చాలా లాభపడిందని పేర్కొన్నారు. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో తాజాగా ఆయన ప్రసంగించారు. ‘‘స్వీయరక్షణ ప్రయత్నాల్లో భాగస్వాములకు ఎల్లప్పుడూ తోడుగా నిలవాలన్నదే మా వైఖరి. అందుకోసం మా భద్రతా ఉత్పత్తులు, సంకేతాలను సమర్థంగా వినియోగించుకుంటాం. దాడికి గురికాబోయే సంస్థల గురించిన సమాచారాన్ని అందజేస్తాం’’ అని పేర్కొన్నారు. మానవ జీవితాల్లో డిజిటల్‌ సాంకేతికత అంతర్భాగంగా మారిన నేపథ్యంలో దాని క్రమబద్ధీకరణకు పటిష్ఠ నిబంధనలు కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను నాదెళ్ల నొక్కిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని